దసరా నవరాత్రులలో మొదటి రోజు అలంకరణ… నైవేద్యం ఏమిటో తెలుసా?

హిందువులకు దసరా అనేది ముఖ్యమైన పండుగ. శక్తి ఆరాధనకు ప్రాముఖ్యత ఇచ్చే పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కాబట్టి కొంతమంది శరన్నవరాత్రి అని కూడా పిలుస్తారు. దేవాలయాలలో ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి తొమ్మిది రూపాల్లో అలంకరణలు చేస్తారు. ఇప్పుడు ఆ అలంకరణల గురించి అలాగే ఆ రోజు ఏమి నైవేద్యం పెట్టాలో వివరంగా తెలుస్కుందాం.

మొదటి రోజు – శ్రీ బాలాత్రిపుర సుందరి అలంకారం

దసరా నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారి అలంకరణ శ్రీ బాలాత్రిపుర సుందరి అలంకారం. అమ్మవారు మూడు రూపాలలో కనిపిస్తారు. – ఒకటి కుమారిగా బాలత్రిపుర సుందరి, రెండు యవ్వనవతిగా లలితాత్రిపుర సుందరి, మూడు వృధ్ధరూపం త్రిపురభైరవి. ఈ తల్లి అధీనంలో మనసు,బుద్ధి, అహంకారం ఉంటాయి. ఈ తల్లిని ఆరాదిస్తే మనో వికారాలు అన్ని తొలగిపోతాయి. ఈ రోజు రెండు నుంచి పదేళ్ళలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజ చేసి, కొత్తబట్టలు పెడతారు. ”ఓం ఐం హ్రీం శ్రీం బాల త్రిపుర సుందర్యై నమ్ణ” అని నూటా ఎనిమిది సార్లు చదవాలి. అమ్మవారికి ప్రత్యేకం గా పాయస నైవేద్యం పెట్టాలి. ఆమె అనుగ్రహాన్ని పొందితే, సంవత్సరం పొడుగునా అమ్మవారికి చేసే పూజలన్నీ సత్వర ఫలితాలనిస్తాయి.