Movies

శివమణికి అప్పుడే పదిహేనేళ్ళు..! శివమణి గురించి తెలియని నమ్మలేని నిజాలు

పూరి టాలీవుడ్ పర్వంలో 7వ సినిమా శివమణి. వరుస హిట్లతో దూసుకుపోతున్న పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున నటించిన శివమణి 9848022338 చిత్రం రొమాంటిక్ థ్రిల్లర్‌గా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది.

పూరి జగన్నాథ్‌కు స్టార్ డైరెక్టర్ స్టేటస్ తీసుకొని వచ్చింది. ఈ చిత్రం పేరులో మొబైల్ నెంబర్‌ను జోడించి వైవిధ్యాన్ని ప్రదర్శించాడు పూరి. ఆ మొబైల్ నెంబర్ మతలబు ఏంటో తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపారు ప్రేక్షకులు. ఈ సినిమా కథను ‘మెసేజ్ ఇన్ బాటిల్’ అనే ఆంగ్ల చిత్రం నుండి ప్రేరణ పొందారు.

“నేను డ్యూటీలో జాయిన్ అయ్యి 4 ఏళ్లు అయ్యింది. 8 సెంటర్లు మారా. ఏ సెంటర్ కైనా ఫోన్ చేసి అడుగు..శివమణిగాడు ఆపేయమన్నాడు పెట్టుకోవచ్చా అని అడుగు. ఒక్కడు.. ఒక్కడు అయినా పర్లేదు.. పెట్టుకోవచ్ఛు అని అంటే పెట్టుకో.. ఆ తర్వాత నీ సైడ్ కూడా రాను…ఏంది”

ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన నాగార్జున.. నట విశ్వరూపం చూపించాడు. కోన వెంకట్ మార్క్ డైలాగులు నాగార్జున నోటివెంట అద్భుతంగా పేలాయి. ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో నటించడం సినిమాకు మరింత ప్లస్ అయ్యింది. అప్పుడప్పుడే తెలుగు తెరకు పరిచయం అవుతోన్న నటి అసిన్‌కు ఒక మరుపురాని విజయం ఈ చిత్రం.

ఇప్పుడు మనమధ్య లేని సంగీత దర్శకుడు చక్రి.. ఈ చిత్రానికి సంగీతం అందించాడు. పూరి మరియు చక్రి కాంబినేషన్‌లో వచ్చిన అద్భుత ఆల్బంలలో ఇది ఒకటి. సినిమాలోని అన్ని పాటలు శ్రోతలను ఎంతో అలరించాయి, ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి.

ఈ చిత్రం ఆడియో ఫంక్షన్‌లో ఇప్పటి యువ హీరో అఖిల్ మరియు జూనియర్ ఎన్టీఆర్‌లు వచ్చి సందడి చేశారు. బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన ఈ చిత్రం 35 సెంటర్లలో 100 రోజులు పూర్తి చేసుకుంది.