Movies

ఈ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కి స్థాయికి తగ్గ పేరు రాకపోవటానికి కారణం ఏమిటో తెలుసా?

సినిమా ప్రపంచమే ఒక మాయ. ఎవరికెప్పుడు గుర్తింపు వస్తుందో,ఎవరెపుడు తెరమరుగుఅవుతారో ,అసలు గుర్తింపు లేకుండా పోతారో తెలియదు. ఎన్నో హిట్స్ అందించిన స్టార్ డైరెక్టర్ రేలంగి నరసింహారావు పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. కె వి రెడ్డి,జంధ్యాల మాదిరిగా హాస్యరస చిత్రాలు అందించి,ఎందరికో సినీ జీవితం ప్రసాదించిన రేలంగి నరసింహారావు మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు. తక్కువ బడ్జెట్ తో సినిమాలు తీసి, సూపర్ హిట్స్ అందించిన ఘనత ఈయనిది. బివి ప్రసాద్ డైరెక్షన్ లో 1971లో వచ్చిన మహమ్మద్ బీన్ తుగ్లక్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీ కెరీర్ ప్రారంభించిన రేలంగి, ఆతరువాత ఊరికి ఉపకార సినిమాకు కె ఎస్ ఆర్ దాస్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు.

ఇక దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు దగ్గర సంసారం సాగరం సినిమాకు రేలంగి నరసింహారావు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు. 1980వరకూ దాసరి దగ్గరే పనిచేసిన ఈయన ఆతర్వాత సొంతంగా దర్శకత్వ బాధ్యతల వైపు మొగ్గుచూపి,చందమామ అనే హాస్య సినిమా చేసారు. అయితే ఆసినిమా రెండేళ్ల వరకూ విడుదల నోచుకోలేదు. ఇక ఆతర్వాత నేను మా ఆవిడ,ఏవండోయ్ శ్రీవారు,ఇల్లంతా సందడి సినిమాలను డైరెక్ట్ చేసాడు. చంద్రమోహన్ తో 18సినిమాలు,రాజేంద్ర ప్రసాద్ తో 32హాస్య చిత్రాలు తీసాడు.

ఇక అక్కినేనితో దాగుడు మూతల దాంపత్యం,శోభన్ బాబు తో సంసారం,కృష్ణంరాజుతో యమ ధర్మరాజు చిత్రాలు తీసి హిట్స్ ఇచ్చాడు.ఇక 1991లో రాజేంద్ర ప్రసాద్ తో రేలంగి తీసిన ఇద్దరు పిల్లల ముద్దుల పోలీస్, ఎదురింటి మొగుడు,పక్కింటి పెళ్ళాం సినిమాలు కామెడీ సినిమాల్లో అత్యధిక కలెక్షన్స్ సాధించి పెట్టాయి. ఫలితంగా కన్నడ రంగంలో అడుగుపెట్టి ఈ రెండు సినిమాలను రాజకుమార్ కొడుకు శశికుమార్ తో తీసి అక్కడ కూడా హిట్ కొట్టాడు.

మొత్తం 7కన్నడ సినిమాలు చేసాడు. ఇక తమిళంలో నగేష్ కొడుకు ఆనంద్ బాబుతో ఓ సినిమా తీసి హిట్ అందుకున్నాడు. ఇక హాస్య రచయిత ఆదివిష్ణుతో కల్సి సుందరి సుబ్బారావు మూవీకి బెస్ట్ స్క్రీన్ ప్లే నంది అవార్డు అందుకున్నాడు. రామోజీరావు తీసిన ఈ సినిమా మంచి హిట్ అందుకుంది. నవ్వులు పువ్వులు పూయించిన డైరెక్టర్ గా రెంలంగి నరసింహారావు 70సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇక బుల్లితెరపై కూడా హాస్యాన్ని చిలికించి తనదైన ముద్ర వేసిన రేలంగి హాస్యం,సెంటిమెంట్ జోడించి చక్కిలిగింతలు పెట్టించాడు.

మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తూ సినిమాలను తీసిన రేలంగి హాస్యంలో దిగ్గజ రచయితలను వెండితెరకు పరిచయం చేసిన ఘనత దక్కించుకున్నాడు. సుమన్,కిన్నెర ,రేవతి తదితర నటీనటులను తెలుగు తెరకు పరిచయం చేసారు. పోలీసు భార్య, చిన్నోడు పెద్దోడు, డబ్బెవరికి చేదు,కొంటెకాపురం,గుండమ్మగారి కృష్ణుడు, మామా అల్లుడు వంటి చిత్రాలు రేలంగి ప్రతిభకు దర్పణంగా నిలుస్తాయి. అయితే సినీ పరిశ్రమలో ఇంకా ఈయన ఉన్నా,లేనట్టే ఉండడం చూస్తే, రావాల్సినంత పేరు , గుర్తింపు రాలేదని చెప్పాలి.