Politics

అంబానీ అన్నదానంలో స్పెషల్ ఏమిటో తెలుసా?

గొప్పోళ్ళ ఇంట పెళ్లి సందడి నిజంగా సందడే కదా. ముఖేష్ అంబానీ ఏకైక కూతురు ఈషా అంబానీ పెళ్లి వేడుకలు రాజస్థాన్ లోని ఉదయపూర్ లో ప్రారంభమయ్యాయి. ఉదయపూర్ వాసుల ఆశీర్వాదం కోసం అంబానీ కుటుంబం డిసెంబర్ 7నుంచి 10వ తేదీవరకూ నిత్యాన్నదానం చేస్తున్నారు. ఏ దానం అయినా ఇవ్వండి ఇంకా ఇంకా కావాలని అంటారు. కానీ అన్నదానం చేస్తే , కడుపు నిండాక ఇక చాలు అంటారు. అందుకే అన్ని దానాల్లో అన్నదానం మిన్నయని,అన్నం పరబ్రహ్మ స్వరూపమని అంటారు.

అన్నం తిన్నాక ఇక చాలని సంతృప్తి చెందుతారని భావించి మూడు పూటలా అన్నదానం నాలుగు రోజులపాటు అంబానీ కుటుంబం చేపట్టింది. తొలిరోజు 5100మందికి అంబానీ కుటుంబం స్వయంగా వడ్డించింది. దాదాపు 100రకాల వంటకాలతో అందరినీ మైమరపించారు. చాలు చాలు అనేవరకూ అంబానీ కుటుంబ సభ్యులు వడ్డిస్తూ సంతృప్తి చెందారు. ముఖేష్ అంబానీ,గీతా అంబానీ దంపతులు,అజయ్,స్వాతి పెరుమాళ్ ,ఈషా, ఆనంద్ లు పాల్గొన్నారు.

మరో పక్క ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ జరుగుతున్నాయి అంతేకాదు భారతీయ కళలను ప్రాజెక్ట్ చేస్తూ స్వదేశీ బజార్ పేరిట ఓ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటుచేశారు. స్వదేశీ ఉత్పత్తులకు లాభం చేకూరేలా ఈ ప్రదర్శన ఏర్పాటుచేశారు. ఈ ప్రదర్శనకు సినీ రాజకీయ ప్రముఖులు, అంతర్జాతీయ ప్రముఖులు వస్తున్నారు. డిసెంబర్ 12న పెళ్లి వైభవంగా జరుగనుంది.