Politics

జనసేనకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు – ఎన్నికల్లో పవన్ కి లాభమా నష్టమా?

రాజకీయ పార్టీకి ఎన్నికలే కీలకం. ఎన్నికల్లో గెలుపు ఓటములను నిర్ణయించే ఓటరుల దగ్గరకు వెళ్లాలంటే,పార్టీకి గుర్తు కీలకం. అనుకున్న గుర్తు రావడం,అది జనంలోకి జోరుగా తీసుకెళ్లడం లోనే ఆ పార్టీ భవిత ఆధారపడి ఉంటుంది. ఇక గత ఎన్నికల ముందు పార్టీ ప్రకటించినప్పటికీ పోటీకి దూరంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో పోటీకి సమాయత్తం అవుతున్నారు. జనం మధ్యలో తిరుగుతూ సమస్యలపై గళం వినిపిస్తున్నారు. అధికార పార్టీ తీరుని ఎండగడుతూ తాము అధికారంలోకి వస్తే, ఏమి చేస్తామో వివరిస్తున్నారు. ఇక కీలకమైన గుర్తు కేటాయింపు కూడా జరిగింది.

జనసేనకు గాజుగ్లాసు గుర్తుని కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్నీ ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ వివరిస్తూ ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు. గాజు గ్లాస్ ఫోటోని కూడా పంచుకున్నారు. దీంతో ఈ గుర్తు పెద్దఎత్తున సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఇక అభిమానులు,పార్టీ నేతలు, కార్యకర్తలు గాజు గ్లాస్ గుర్తుకే మీ ఓటు అంటూ హడావిడి చేస్తున్నారు.

ఫ్లెక్సీలలో గుర్తు వేసి కట్టేస్తున్నారు. అలాగే మృగరాజు మూవీలోని చిరంజీవి పాడిన చాయ్ పాట ఫోటోలు,వీడియాలను కూడా షేర్ చేస్తున్నారు. గాజు గ్లాస్ గుర్తుని సోషల్ మీడియా ద్వారా బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఇక గుర్తు కేటాయింపు నేపథ్యంలో పార్టీ వర్గాలు,అభిమానులు సంబరాల్లో మునిగిపోయి గుర్తుపై పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంటే,కొందరు నెగెటివ్ పెదవి విరుస్తున్నారు.

కాంగ్రెస్, టిడిపి,వైస్సార్ కాంగ్రేస్ గుర్తులతో పోలిస్తే,గాజు గ్లాస్ గుర్తు అంతగా ఆకట్టుకునేలా లేదని నిరుత్సహం వ్యక్తంచేస్తున్నారు. గాజు గ్లాసు ఉపయోగాలను చెప్పడం కూడా కష్టం అవుతుందని, ఎందుకంటే గాజుగ్లాస్ వలన పెద్దగా ఉపయోగాలు లేవని అంటున్నారు. సున్నితంగా ఉండడం, త్వరగా పగిలిపోయే గుణం ఉండడం వలన ప్రత్యర్ధులు నెగెటివ్ ప్రచారం ఎక్కువగా చేసే ప్రమాదం ఉందన్న మాట వినిపిస్తోంది.

దీంతో జనసేన శ్రేణులు కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. గుర్తుని జనంలోకి తీసుకెళ్లడం ఖాయమని,ఓట్ల వర్షం కూడా బానే పడుతుందని కొందరు ఆశావహ కార్యకర్తలు వాదిస్తున్నారు. మొత్తానికి గాజు గ్లాస్ గుర్తు లాభమా , నష్టమా అనేది వచ్చే ఎన్నికల్లో తేలనుంది.