Movies

ఎన్టీఆర్ మేకప్ మ్యాన్ పీతాంబరం కొడుకు ఓ స్టార్ డైరెక్టర్ అని తెలుసా ?

సినిమాల్లో ఆర్టిస్టులు అందంగా కనబడాలన్నా,వారి పాత్రలు సజీవ రూపంగా ఉండాలన్నా అందుకు మేకప్ మ్యాన్ పనితనం కీలకం. శిల్పాలను చెక్కే శిల్పి ఎలాగో ఆరిస్టులను పాత్రలకు అనుగుణంగా తయారుచేసే మేకప్ మ్యాన్ లు కూడా అలాగే అని చెప్పాలి. ఇక పీతాంబరం అనే మేకప్ మ్యాన్ చాలా పాపులర్. విశ్వవిఖ్యాత నటసార్వ భౌమ పద్మశ్రీ ఎన్టీఆర్ పర్సనల్ మేకప్ మ్యాన్ ఈయన. ఎన్టీఆర్ కృష్ణుడిగా, రాముడిగా, శ్రీ వేంకటేశ్వర స్వామిగా తీర్చిద్దిన ఘనత పీతంబరంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఎన్టీఆర్ వెంట ప్రయాణం చేసిన ఆయన భార్య బసవతారకం తర్వాత ఆయన వెంట ఎక్కువ నడిచింది పీతాంబరమే. ఎన్టీఆర్ కటౌట్లకు థియేటర్ల దగ్గర అభిమానులు పాలాభిషేకం చేసేవారంటే,ఆయన్ని అంత అందంగా తీర్చిదిద్దిన ఘనత పీతాంబరానికే దక్కుతుంది.

ఎన్టీఆర్ ని రాముడుగా, కృష్ణుడుగా చూపించేందుకు పీతాంబరం చాలా కష్టపడేవారట. పదిమంది అసిస్టెంట్స్ నీలిరంగు కలిపి ఇస్తే,అది ఎన్టీఆర్ కి పూసేటప్పటికీ వేళ్ళు నొప్పి పుట్టేవట. అయితే, మేకప్ పూర్తయ్యేక వచ్చిన రూపం చూసాక ఆ నొప్పులు ఎగిరిపోయేవట. ఇక ఓసారి మేకప్ అయ్యాక పీతాంబరానికి ఓ విచిత్ర అనుభూతి కల్గింది. సి పుల్లయ్య డైరెక్షన్ లో వచ్చిన శ్రీ వేంకటేశ్వర మహత్యం చిత్రంలో చివరి సీన్ లో ఎన్టీఆర్ ని శ్రీ వేంకటేశ్వరునిగా చూపించడానికి పీతాంబరం చాలా శ్రమించారు.

తీరా మేకప్ పూర్తయ్యాక ఆ రూపం చూసి,ఏడుకొండల వాడా వెంకట రమణా అంటూ అసిస్టెంట్ భద్రం తో కల్సి ఎన్టీఆర్ కాళ్ళ మీద పడ్డారట. వాళ్ళను పక్కకి తీయడానికి సిబ్బంది చాలా శ్రమపడాల్సి వచ్చింది. మేకప్ వేసిన ఆయనకే అలా ఉంటే, ఇక వెండితెరమీద ఎన్టీఆర్ ని చూసిన ఆడియన్స్ కి ఇక ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో చెప్పక్కర్లేదు.

ఇక మేకప్ మ్యాన్ గా ఉంటేనే సొంతంగా 25తమిళ , తెలుగు సినిమాలను ప్రొడ్యూస్ చేసారు. ఎన్టీఆర్ తో 1975లో అన్నదమ్ముల అనుబంధం,1979లో యుగంధర్ మూవీలను పీతాంబరం నిర్మించారు. మేకప్ ఆర్టిస్టు అసోసియేషన్ ప్రారంభించి 30ఏళ్ళు ప్రెసిడెంట్ గా వున్నారు. ఇక పీతాంబరం కొడుకు ఓ స్టార్ డైరెక్టర్. ఆయన ఎవరో కాదు చంద్రముఖి,నాగవల్లి వంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన పి వాసు. ఈయన డైరెక్టర్ గానే కాకుండా, రచయితగా,నటుడిగా కూడా రాణిస్తున్నారు.

ఇక నిజానికి పీతాంబరం అంతకుముందు తమిళనాడు మాజీ సీఎం ఎంజీఆర్ సినిమాల్లో ఉండగా మేకప్ మ్యాన్ గా ఆయనకు సేవలందించేవారు. ఓరోజు ఎంజీఆర్ ఇంటికి వెళ్లిన ఎన్టీఆర్ అక్కడ మేకప్ అవుతున్న ఎంజీఆర్ ని,మేకప్ వేస్తున్న పీతాంబరాన్ని చూసారు. మేకప్ తీర్చిదిద్దిన తీరు చూసి, తనకు కూడా ఈయన మేకప్ వేయాలని కోరారట. దాంతో అప్పటినుంచి ఎన్టీఆర్ కి మేకప్ మ్యాన్ గా మారిన పీతాంబరం, ఎన్టీఆర్ సినిమాలు వదిలేసి రాజకీయాల్లో బిజీ అయ్యాక పీతాంబరం తన మేకప్ కిట్ ని వదిలేసారట.