Politics

పవన్ కి మెగాస్టార్ పొలిటికల్ సపోర్ట్ ఎందుకు ఇవ్వడం లేదో తెలుసా?

పవన్ కళ్యాణ్ రెండింటా సక్సెస్ అవుతాడని గతంలో ఓ సినిమా ఫంక్షన్ లో చెప్పి అభిమానులను ఉత్సాహపరిచిన మెగాస్టార్ చిరంజీవి మరి ఇప్పుడు పవన్ కి పొలిటికల్ సపోర్ట్ ఎందుకు ఇవ్వడం లేదో ఎవరికీ అర్ధం కావడం లేదు. నిజానికి పవన్ తల్లి ఫుల్ సపోర్ట్ గా నిల్చి ,నాలుగు లక్షల రూపాయల పార్టీ విరాళాన్ని జనసేన ఆఫీసుకుకి వచ్చి మరీ అందజేశారు. నిండుమనసుతో ఆశీర్వదించారు. ఇక మెగా బ్రదర్ నాగబాబు కూడా తమ్ముడు పవన్ కి రాజకీయకంగా అండగా నిలుస్తూ ప్రత్యర్థుల విమర్శలకు కూడా ధీటుగా స్పందిస్తున్నారు.

అంతేకాదు కొడుకు వరుణ్ తేజ్ తో కల్సి ఒక కోటి పాతిక లక్షల రూపాయల విరాళాన్ని కూడా జనసేనకు అందించారు. అయితే చిరంజీవి నుంచి ఇలాంటి సపోర్ట్ లేకుండా పోయింది. ప్రజారాజ్యం పార్టీ మిగిల్చిన చేదు అనుభవాలే ఇందుకు కారణమా అనిపిస్తోంది. అసలు చిరంజీవి పార్టీ పెట్టినపుడు పవన్ పూర్తి అండగా నిలిచాడు. ప్రజారాజ్యం పార్టీ యువ విభాగం యువరాజ్యానికి అధ్యక్షుడిగా విస్తృత ప్రచారం చేసి, అభిమానులను ప్రజలను ఆకర్షించాడు.

ఇక ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసినపుడు కూడా తన ఆవేదన , ఆక్రోశాన్ని ఎక్కడా బహిర్గతం చేయలేదు. అయితే చిరంజీవి కాంగ్రెస్ లో కేంద్ర మంత్రిగా చేసి, రాజ్యసభ సభ్యత్వం అయిపోయాక, రాజకీయాలకు పూర్తి దూరంగా ఉంటూ కేవలం సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి, సినిమాలకే పరిమితం అయిపోయారు. ఖైదీ నెంబర్ 150సినిమా హిట్ కావడంతో ఇప్పుడు 150వ సినిమా సైరా మూవీ చేసుకుంటూ సైలెంట్ గా ఉంటున్నారు. అంతేతప్ప తమ్ముడికి ఏమాత్రం సపోర్ట్ గా మాట్లాడ్డం లేదు.

చివరకు మొన్నటికి మొన్న రామ్ చరణ్ మూవీ వినయ విధేయ రామ ప్రీరిలీజ్ ఫంక్షన్ లో కూడా పవన్ గురించి రామ్ చరణ్ పరోక్షంగా జనసేన గుర్తు గాజు గ్లాసు గుర్తు గురించి ప్రస్తావిస్తూ అందరూ టీ తాగడం నేర్చుకుంటున్నారని వ్యాఖ్యానించి, అభిమానుల్లో జోష్ పెంచారు. జనం కోసం సినిమాలు వదులుకుని కష్టపడుతున్నారని కూడా చెర్రీ మెచ్చుకున్నాడు.

అయితే ఫాన్స్ ఎంతగా వత్తిడి చేసినా చిరు ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. ఏదో పవన్ గురించి ప్రస్తావించినా ఎక్కడా జనసేన ఊసెత్తలేదు. దీన్ని బట్టి జనసేనకు మద్దతుగా నిలిచే ఛాన్స్ చిరుకి లేదనే మాట వినిపిస్తోంది. సినిమాల మీద మాత్రమే దృష్టి పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. చూద్దాం ముందు ముందు ఎలా ఉంటుందో.