Politics

హిందూపూర్ లో బాలయ్య గెలుస్తాడా….లేక కష్టమేనా?

ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో చెప్పడం కష్టం. ఒక్కసారి పరిస్థితిలు తిరగబడితే మహామహులే ఓటమి పాలయిన ఘటనలు ఎన్నో వున్నాయి. అయితే ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న లోకసభ,అసెంబ్లీ ఎన్నికల్లో అన్నిచోట్లా రసవత్తర పోరు నెలకొంది. ఇక అనంతపురం జిల్లా హిందూపూర్ నియోజక వర్గంపై ఆసక్తి పెరిగిపోతోంది. ఎందుకంటే గతంలో ఇక్కడ గెలిచిన నందమూరి బాలయ్య మరోసారి బరిలో దిగారు. ఐదేళ్ల క్రితం ఎన్నికల్లో బాలయ్య పోటీచేసి సినిమా క్రేజ్ తో గెలిచారని, అయితే ఇప్పుడు పరిస్థితి చూస్తే 20ఏళ్ళ క్రితం హిందూపూర్ ఎలా ఉందొ ఇప్పుడు అలానే ఉందని అంటున్నారు.

ఈ నియోజక వర్గంలో ముస్లిం జనాభా ఎక్కువని, వీరి మొగ్గు ఎటుంటే వారికి గెలుపు అవకాశాలు ఎక్కువని అంటారు. ఇక మాజీ ఎమ్మెల్యే గని టిడిపిని వదిలిపెట్టి వైస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈయనకు మంచి పట్టున్నప్పటికీ బాలయ్య మీద పోటీకి జంకడంతో ఇక్బల్ అనే వ్యక్తిని వైసిపి రంగంలో దించింది. గని, నవీన్ నిశ్చల్ పూర్తిగా సహకారం అందిస్తే, ఇక్బల్ ఓరకంగా బాలయ్యకు గట్టి పోటీ ఇస్తాడని అంటున్నారు.

అయితే వైసిపిలో కూడా వర్గపోరు ఉందని , ఇక్బల్ గెలిస్తే తమకు భవిష్యత్ ఉండదన్న ఉద్దేశ్యంతో ఇతడికి పూర్తిగా సహకరించకపోవచ్చని అంటున్నారు. ఈ విభేదాలు తారాస్థాయికి చేరితే మళ్ళీ బాలయ్య గెలుపు సునాయాసమని అంటున్నారు. ఒకవేళ నవీన్ నిశ్చల్,గని అందరూ ఇక్బల్ కి పూర్తిగా సహకరిస్తే మాత్రం బాలయ్యకు ఎదురీత తప్పదని అంటున్నారు. అయితే బాలయ్య ఆర్ధిక శక్తి ముందు ఇక్బల్ సరిపోడని, అందుకే ఒక శాతం ఎడ్జ్ ఉందని విశ్లేషకులు అంటున్నారు.

ఇక హిందూపూర్ ని సుందరీకరించినట్టు గానీ, రహదారులు బాగుచేసినట్లు గానీ లేవని అంటున్నారు. ఇరుకు రోడ్లతో జనం సతమతమవుతున్నారని అంటున్నారు. అయితే బాలయ్య అభివృద్ధి బానే చేసారని అయితే ఎక్కువ భాగం హిందూపూర్ టౌన్ కి పరిమితం అయ్యారని , పల్లెలను ఏమాత్రం పట్టించుకోలేదని అంటున్నారు. మరి ఈ నియోజక వర్గం లో సంచలనం నమోదవుతుందో లేదో వేచి చూడాలి.