రచయత నుండి దర్శకుడిగా మారిన కొరటాల శివ కెరీర్ లో ఎన్ని కష్ఠాలు పడ్డారో తెలుసా?
సినీ రచయితగా తన కెరీర్ ను ప్రారంభించి,మిర్చి సినిమాతో దర్శకుడిగా మారిన డైరెక్టర్ కొరటాల శివ వరుస బ్లాక్ బస్టర్ లతో స్టార్ డైరెక్టర్ అయ్యాడు. 1975 జూన్ 15న గుంటూరు జిల్లా పెదకాకాని లో కమ్యూనిస్ట్ భావజాలం గల ఓ మధ్యతరగతి కుటుంబంలో రెండో సంతానంగా జన్మించాడు. శివ అన్నయ్య రవీంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. శివకు పదేళ్ల వయస్సు ఉన్నప్పుడే తండ్రి చనిపోయాడు. దీంతో తండ్రి ఉద్యోగం తల్లికి వచ్చింది. అందరూ అక్షరాస్యులు కావడంతో ఇంట్లో ఎక్కువగా పుస్తకాలు ఉండేవి. అందుకే శివకు పుస్తక పఠనం ఎక్కువగా అలవాటైంది. మహా ప్రస్థానం, రామాయణ, మహాభారతాలు కూడా చదవడంతో పాటు చిన్నప్పటినుంచి కథలు రాసే అలవాటుండేది.
బీటెక్ పూర్తిచేసిన శివ, ఆరునెలలు సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసాడు. ఇక తనకు బావ వరుసైన పోసాని కృష్ణ మురళి దగ్గర 1998లో సహాయకుడిగా చేరాడు. కథలు రాయడంతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు. ఐదేళ్లు కష్టపడి మంచి రైటర్ గా రాటుదేలాడు. అప్పట్లో పదివేలు జీతంగా ఇచ్చేవారట. ఇక అరవింద అనే అమ్మాయిని ప్రేమించడం,ఆమె లండన్ వెళ్లి వచ్చాక పెళ్లిచేసుకోవడం జరిగాయి.
రవితేజ భద్ర సినిమాకు రచయితగా కథ అందించాడు. ఒక్కడున్నాడు, మున్నా, బృందావనం ఊసరవెల్లి వంటి సినిమాలకు మాటల రచయితగా పనిచేశాడు. 2011వరకూ సహాయ రచయితగా రాణించిన శివ,ఆతర్వాత తానె సొంతంగా కథ రాసుకుని 2013లో ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చి సినిమాతో దర్శకుడిగా మారాడు. తన మిత్రుడు నిర్మాతగా వ్యవహరిస్తానని మాటివ్వడంతో మిర్చి సినిమా మొదలుపెట్టి శివ డైరెక్టర్ అయ్యాడు. ప్రభాస్ హీరోగా వచ్చిన ఆ సినిమా హిట్ అవ్వడంతోనే తొలిచిత్రంతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.
మిర్చి మూవీతో ప్రభాస్ కి మంచి హిట్ దక్కింది. అయితే ఈ సినిమా రెండు రోజుల్లో విడుదల అవుతుందనగా తల్లి చనిపోయింది. దాంతో అప్పట్లో విషాదం అలుముకుంది.ఇక 2015 లో మహేష్ బాబుతో తీసిన శ్రీమంతుడు మూవీ బ్లాక్ బస్టర్ అయింది. గ్రామాన్ని దత్తత తీసుకోవడం అనే నేపథ్యంతో వచ్చిన ఈ మూవీ మహేష్ బాబుకి మంచి హిట్ వచ్చింది.
ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సాధించింది. ఈ సినిమా తర్వాత చాలామంది రాజకీయ నాయకులు తమకు నచ్చిన గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేశారు. ఉత్తమ డైరెక్టర్ గా కొరటాల శివకు ఫిలిం ఫేర్ అవార్డు వచ్చింది. ఇక 2016లో జూనియర్ ఎన్టీఆర్ ,మోహన్ లాల్ సమంత, నిత్యామీనన్ నటించిన జనతా గ్యారేజ్ మూవీ కలెక్షన్ల వర్షం కురిపించింది. 2018లోమహేష్ బాబుతో భరత్ అనే నేను మూవీ కూడా కొత్త పుంతలు తొక్కించింది. భారీ వసూళ్లతో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.