Politics

ఎన్నికలలో బ్లూ ఇంక్ ఎందుకు వాడతారో తెలుసా? బ్లూ ఇంక్ గురించి ఈ విషయాలు తెలుసా?

ఎన్నికలంటే ఆ సందడే వేరు. నామినేషన్లు,ప్రచారం, పోలింగ్ ,లెక్కింపు ఇలా ఎన్ని ఘట్టాలో ఉంటాయి. ఓటర్లు తీర్పు చెప్పే పోలింగ్ ఘట్టం చాలా కీలకమైనది. పోలింగ్ నాడు ఓటు వేసే ప్రతి ఓటర్ ఓటు వేసే ముందు సంతకం చేస్తాడు. లేదా వేలిముద్ర వేస్తాడు. తరువాత అక్కడ ఉన్న ఎన్నికల పోలింగ్ బూత్ అధికారులు మన వేలికి బ్లూ ఇంక్ సిరా వేస్తారు. ఒకసారి ఓటు వేసిన వ్యక్తి మళ్ళీ అదే పోలింగ్ లో ఓటు వేయకుండా అరికట్టడానికి ఈ పద్దతిని 1962 నుండి మొదలుపెట్టారు. ఈ బ్లూ ఇంక్ సిరాను భారతదేశంలో జరిగే ఎన్నికల్లోనే కాదు, కాంబోడియా, మాల్దీవ్స్, నేపాల్, దక్షిణాఫ్రికా,కెనడా , టర్కీ లాంటి దేశాలకు కూడా మన దేశం నుండే ఎన్నికల ఇంక్ ఎగుమతి అవుతుంది.

మొదటిసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ చాలా సమస్యలు ఎదుర్కొంది. ఓటు వేసినవాళ్లు మళ్లీ ఓటు వేసేందుకు వస్తుండటంతో ఎలా అడ్డుకోవాలో అర్థం కాలేదు. అప్పుడే కొన్నిరోజుల వరకు చెరిగిపోని సిరాతో గుర్తు వేయాలన్న ఆలోచన వచ్చింది. మన దేశం లో 1962లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మొదటిసారిగా బ్లూ ఇంక్ వాడటం మొదలుపెట్టారు. ఆ ఘనత మొదటి ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్‌కు దక్కుతుంది. ఎన్నికల్లో ఇంక్ వాడే సంప్రదాయం అప్పుడే మొదలైంది.

37(1) నిబంధన ప్రకారం ఓటర్ ఎడమచేతి వేలుపై సిరా గుర్తును చూడాల్సిన బాధ్యత పోలింగ్ అధికారిది.ఎన్నికల్లో ఓటు వేసేప్పుడు బ్లూ ఇంక్‌తో పెట్టే గుర్తు 15 రోజులపాటు అలాగే ఉంటుంది. గోళ్లపై నుంచి గుర్తు మొత్తం చెరిగిపోవడానికి కనీసం మూడు నెలలైనా పడుతుంది. సిల్వర్ నైట్రేట్ పేపర్‌పై రాసేందుకు ఉపయోగించే ఇంక్ కాదు. సిల్వర్ నైట్రేట్‌ను వేలిపై గోరు కింద అప్లై చేయగానే చర్మంపై ఉండే ఉప్పుతో కలిసి చెరిగిపోకుండా గుర్తు ఏర్పడుతుంది. ఆ గుర్తును వెంటనే చెరపడం అంత సులువుకాదు.అందుకే ఎన్నికల సిరాలో 7.25 శాతం సిల్వర్ నైట్రేట్ ఉంటుంది. నేషనల్ ఫిజికల్ ల్యాబరేటరీ, నేషనల్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సాయంతో సిరాను మైసూర్ పెయింట్స్ వార్నిష్ లిమిటెడ్ సంస్థలు కలిసి తయారు చేస్తున్నాయి.