Movies

జయప్రద జీవితం ఇలా అవ్వటానికి కారణం ఎవరు…. ఎవరికీ తెలియని నమ్మలేని నిజాలు

డాక్ట‌ర్ కాబోయి యాక్ట‌ర్ అయ్యాయ‌ని ఇండస్ట్రీలో చాలామంది చెప్పే మాటే. సినీ రంగంలో ఓ వెలుగు వెలిగి, వివాహ జీవితంలో చీక‌ట్లు నింపుకుని, రాజ‌కీయ రంగంలో రాణిస్తున్న జ‌య‌ప్ర‌ద కూడా డాక్ట‌ర్ కావాల‌నుకుంది. కానీ 14 ఏళ్ల‌కే ఇండస్ట్రీకి వచ్చి,ప‌ది రూపాయ‌ల పారితోషికం నుంచి పార్లమెంట్ వ‌ర‌కు ఎదిగిన బ్యూటీ స్టార్ ఆమె. జయప్రద గురించి చెప్పాలంటే, అందానికే అసూయ పుట్టే అందం అని అంటారు. మ‌యూరానికే నాట్యం నేర్పే క‌ళ ఆమె సొంతం. ఆమె పోషించిన పాత్ర‌ల‌న్నీ జ‌న‌రంజ‌కాలే. దాదాపు మూడు ద‌శాబ్దాల సినీ ప్ర‌స్థానంలో ఎన్నో అద్భుత‌మైన పాత్ర‌లు పోషించి.. ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లో కొనసాగుతున్న అల‌నాటి తార జ‌య‌ప్ర‌ద.

1962లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని రాజ‌మండ్రిలో జన్మించిన జయప్రద అస‌లు పేరు ల‌లితా రాణి. వాళ్ల నాన్న‌కు లలిత క‌ళ‌లంటే చాలా ఆస‌క్తి. అందుకే ఆమెకు ల‌లితా రాణి అనే పేరు పెట్టారు. రాజ‌మండ్రిలో ఏ సినిమా షూటింగ్ జ‌రిగినా, ఆయ‌న అన్ని విధాలా స‌హ‌క‌రించేవారు. అదే విధంగా సినిమా పంపిణీదారునిగా వ్య‌వ‌హ‌రించేవారు. నాన్న ఫిల్మ్ డిస్టిబ్యూట‌ర్ కావ‌డంతో సినిమాల్లోకి తీసుకురావాల‌ని భావించి, ఏడ‌వ ఏట నుంచే నృత్య శిక్ష‌ణ‌కు పంపారు. జ‌య‌ప్ర‌ద నృత్యంతో పాటు సంగీతం కూడా నేర్చుకుంది.

ఆమెలో ఎవ‌రికీ తెలియ‌ని సింగర్ కూడా దాగి ఉంది. జ‌య‌ప్ర‌ద‌కు ఒక అక్క‌, ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు ఉన్నారు. జ‌య‌ప్ర‌ద‌ పెద్ద‌గా చదువుకోక పోయినా జీవితాన్ని చ‌దివింది. జ‌య‌ప్ర‌ద‌కు నృత్యం అంటే పిచ్చి. 14వ సంవ‌త్స‌రంలో ఆమె స్కూలు ఫంక్ష‌న్‌లో నృత్యం చేస్తుండ‌గా ద‌ర్శ‌కుడు ఎం.ప్ర‌భాక‌ర్ రెడ్డి చూశారు. ‘భూమి కోసం’ అనే సినిమాలో ఆమెను మూడు నిమిషాల పాట కోసం తీసుకున్నారు. ఆ పాట‌కు జ‌య‌ప్ర‌ద‌కు ప‌ది రూపాయ‌ల పారితోషికం అంద‌జేశారు. ఆయ‌నే జ‌య‌ప్ర‌ద అని నామ‌క‌ర‌ణం చేశారు. ఆ త‌ర్వాత సినిమాల్లో ఆమె చిన్న పాత్రలు పోషించారు. కె బాలచంద‌ర్ ‘అంతులేని క‌థ’ సినిమాతో హీరోయిన్‌గా జ‌య‌ప్ర‌ద తొలి హిట్ అందుకున్నారు.

ఆ త‌ర్వాత కళాతపస్వి కె విశ్వనాధ్ ద‌ర్శ‌క‌త్వంతో వ‌చ్చిన‌ సిరిసిరి మువ్వ చిత్రంతో తిరుగులేని హీరోయిన్ గా ఎదిగింది. ఆ సినిమాలో మూగ‌మ్మాయి పాత్ర పోషించిన జ‌య‌ప్ర‌ద త‌న న‌ట‌న‌తో ఇండ‌స్ట్రీని ఆకర్షించింది. తెలుగు, హిందీ, త‌మిళం, క‌న్న‌డ‌, బెంగాలీ, మ‌ళ‌యాళంలో దాదాపు ఆమె 300 చిత్రాల‌కు పైగా నటించిన జయప్రద తెలుగులో అగ్ర హీరోలు ఎన్టీఆర్‌, ఏఎన్ఆర్‌, కృష్ణ‌, శోభ‌న్‌బాబు, చిరంజీవి వంటి వాళ్ళతో జోడి కట్టింది. అయితే ఆమె బాలీవుడ్‌కు వెళ్ల‌డంతో క‌ష్టాలు మొద‌ల‌య్యాయ‌ని అందరూ చెబుతారు.
Jayaprada – MP from Rampur Constituency, UP
1986లో నిర్మాత శ్రీ‌కాంత్ న‌హ‌తాను జ‌య‌ప్ర‌ద పెళ్లి చేసుకున్నారు. ఆయ‌న‌కు అప్ప‌టికే వివాహ‌మై ముగ్గురు పిల్ల‌లున్నారు. వీరి పెళ్లికి శ్రీ‌కాంత్ భార్య ఒప్పుకోలేదు. ఆయ‌న‌కు మ‌ళ్లీ పిల్ల‌లు పుట్ట‌కుండా ఆప‌రేష‌న్ చేయించుకున్నాకే పెళ్లి చేసుకోవ‌డానికి ఆమె ఒప్పుకుంది. అయితే పెళ్ల‌యిన తరువాత మొద‌టి రోజు రాత్రి శ్రీ‌కాంత్ అస‌లు విష‌యం చెప్పడంతో ఆమె గుండెలు ప‌గిలేలా ఏడ్చింది. ఆ త‌ర్వాత ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నించినా, పెద్ద‌లు వారించ‌డంతో ఆలోచ‌న‌ను వదులుకుంది. ఆ త‌ర్వాత జ‌య‌ప్ర‌ద రాజకీయాల వైపు వెళ్ల‌డంతో వారిద్ద‌రు దూరం అయ్యారు. జ‌య‌ప్ర‌ద త‌న అక్క కొడుకు సిద్ధును ద‌త్త‌త తీసుకున్నారు.

1994లో ఎన్టీఆర్ ఆహ్వానం మేర‌కు జ‌య‌ప్ర‌ద తెలుగుదేశం పార్టీలో చేరింది. అప్ప‌ట్లో ఆమెను పార్టీలోకి తీసుకురావ‌డంలో చంద్ర‌బాబు కీల‌క పాత్ర వ‌హించార‌ని చెబుతారు. తెలుగుదేశం పార్టీ మ‌హిళా విభాగం అధ్య‌క్షురాలిగా ప‌ని చేశారు.1996లో టీడీపీ నుంచి రాజ్య‌స‌భ స‌భ్యురాలిగా ఎన్నికై తొలిసారి పార్ల‌మెంట్‌లో అడుగుపెట్టారు. ఎన్టీఆర్ చ‌నిపోయిన త‌రువాత తెలుగుదేశం పార్టీతో తెగ‌దెంపులు చేసుకుని ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు మ‌కాం మార్చిన జయప్రద, ములాయం సింగ్ నేతృత్వంలోని స‌మాజ్‌వాదీ పార్టీలో చేరారు.

2004లో ఎస్పీ త‌ర‌పున యూపీలోని రాంపూర్ నుంచి లోక్‌స‌భ‌కు ఎంపిక‌య్యారు ఆ త‌ర్వాత స‌మాజ్‌వాదీ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన జ‌య‌ప్ర‌ద అమ‌ర్‌సింగ్‌తో కలిసి ‘రాష్ట్రీయ్‌ లోక్‌ మాంచ్‌ పార్టీ’ స్థాపించారు. ఎస్పీ నుంచి బ‌య‌ట‌కు రావ‌డంలో అమ‌ర్‌సింగ్ కీల‌క పాత్ర పోషించార‌ని చెబుతారు. దీంతో వీరిద్ద‌రి మ‌ధ్య ఏదో రిలేష‌న్ ఉంద‌ని పుకార్లు వచ్చాయి. వారిద్ద‌రు ఫొటోలు మార్ఫింగ్ చేసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో జ‌య‌ప్ర‌ద తీవ్ర మ‌న‌స్థాపం చెందారు.

అమ‌ర్‌సింగ్ త‌న‌కు గాడ్‌ఫాద‌ర్ లాంటి వార‌ని, ఇలాంటి పుకార్లు జీర్ణించుకోలేక ఆత్మ‌హాత్యకు ప్ర‌య‌త్నించాన‌ని జ‌య‌ప్ర‌ద ఓ సంద‌ర్భంలో వెల్లడించింది. 2014లో మ‌ళ్లీ ఎస్పీ గూటికి చేరుకుంది. ఆ త‌ర్వాత వెంట‌నే ఆర్ఎల్‌డీలో చేరి బిజ్నూరు నియోజ‌వ‌ర్గం నుంచి పోటీ చేయగా, డిపాజిట్ కూడా ద‌క్క‌లేదు. ఇటీవ‌లే జ‌య‌ప్ర‌ద బీజేపీ గూటికి చేరి ఈ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో మ‌రోసారి రాంపూర్ అభ్య‌ర్థిగా బరిలో దిగుతోంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."