171 ఏళ్ల చరిత్ర కలిగిన చేప మందు వెనుక దాగిన నిజం
హైదరాబాద్ అనగానే చార్మినార్ స్పృహలోకి వస్తుంది. ఆతరువాత ఘుమఘుమ లాడే బిర్యానీ కూడా నోరూరిస్తుంది. ఇక మృగశిర వచ్చిందంటే ఆస్తమా రోగులకు వేసే చేపమందు గుర్తుకు వస్తుంది. బత్తిన ఫ్యామిలీ ప్రతియేటా చేపమందుని అందిస్తూ వస్తోంది. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేస్తుంటారు. అలాగే ఈ ఏడాది జూన్ 8న చేపమందు అందించడానికి సర్వం సిద్ధం చేసారు.
ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఆస్తమా రోగులకు చేప ప్రసాదాన్ని పంపిణీ చేయడానికి బత్తిన ఫ్యామిలీ సమాయత్తం అయింది. దాదాపు 171ఏళ్ళ సుదీర్ఘ చరిత్ర ఈ చేపమందుకి ఉందని బత్తిన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 1847నుంచి నిజాం ల కాలం నుంచే పాతబస్తీలో చేప ప్రసాదం పంపిణీ జరిగేదని చెబుతున్నారు. ప్రస్తుతం చేపమందు అందించే బత్తిన ఫ్యామిలీ సభ్యుల తాతగారు బత్తిన వీరన్న గౌడ్ హయాంలో చేప ప్రసాదం పంపిణీ స్టార్ట్ చేసారు. వీరి మూడవ తరం శంకరయ్య గౌడ్ హయాంలో ఎక్కువగా ప్రాచుర్యం పొందింది.
నిజానికి చేపమందు పంపిణి వెనుక ఆసక్తికర ఘటన ఉంది. ఓ సాధువు బత్తిన వీరన్న గౌడ్ ఇంట్లో ఆతిధ్యం పొందారు. హోరు వానలో తడిసి వచ్చిన సాధువుకి వీరన్న భక్తిగా సేవలు చేసారు. ఆ సేవలకు మెచ్చి ఆస్తమా రోగులకు చేపమందు ఎలా ఇవ్వాలో నేర్పించడంతో ప్రతియేటా మృగశిర కార్తీ ప్రవేశం రోజున ఉచితంగా అందిస్తూ వస్తున్నారు. ఇక ఈ ఏడాది జూన్ 8వ తేదీ సాయంత్రం 6గంటలనుంచి 9వ తేదీ సాయంత్రం 6గంటల వరకూ చేప మందు ప్రసాద వితరణ కొనసాగుతుందని బత్తిన ఫ్యామిలీకి చెందిన హరినాధ్ గౌడ్ తెలిపారు.