భారత రత్న ఎవరికి ఇస్తారు…. నిబంధనలు ఏమిటో తెలుసా?
భారతరత్న పురస్కారం అత్యున్నత స్థాయిలో ప్రదర్శించిన కృషికి/చేసిన సేవకు గుర్తింపుగా ఎటువంటి జాతి, వృత్తి, స్థాయి మరియు లింగ బేధాలను పాటించకుండా ప్రదానం చేయబడుతుంది. 1954 నాటి నిబంధనల ప్రకారం ఈ పురస్కారం కళలు, సాహిత్యం, విజ్ఞానం, ప్రజాసేవ రంగాలలో కృషి చేసినవారికి ఇచ్చేవారు.2011, డిసెంబరులో ఈ నిబంధనలను మార్చి “మానవజాతి పాటుపడే ఈ రంగానికైనా” అనే పదాన్ని చేర్చారు. 1954 నాటి నిబంధనలు మరణానంతరం ఈ పురస్కారం ప్రకటించడాన్ని అనుమతించేవి కావు. కానీ 1955 జనవరిలో ఈ నిబంధనను సడలించారు. 1966లో లాల్ బహదూర్ శాస్త్రిమొట్టమొదటి సారి మరణానంతరం ఈ పురస్కారాన్ని పొందాడు.
ఈ పురస్కారానికి ప్రతిపాదనలు చేసే పద్ధతి లేనప్పట్టికీ, ప్రధానమంత్రి మాత్రమే రాష్ట్రపతికి ఏడాదికి గరిష్ఠంగా ముగ్గురిని మాత్రం సిఫారసు చేయవచ్చు. కానీ 1999లో ఈ పురస్కారాన్ని నలుగురు వ్యక్తులకు ప్రదానం చేశారు. ఈ పురస్కార గ్రహీతలకు రాష్ట్రపతి తన సంతకంతో కూడిన ఒక “సనదు(పట్టా)” మరియు ఒక పతకం ప్రదానం చేస్తాడు. ఈ పురస్కారం క్రింద ఎలాంటి నగదు మంజూరు చేయరు. భారత రాజ్యాంగం యొక్క ఆర్టికల్ 18 (1) ప్రకారం ఈ పురస్కార గ్రహీతలెవ్వరూ తమ పేరు ముందు, వెనుక భారతరత్న అని పేర్కొనరాదు.భారతరత్న పొందిన పౌరులకు 7వ స్థాయి గౌరవం లభిస్తుంది.
భారతరత్న పురస్కారం ప్రకటించినట్లు ఎన్ని ప్రకటనలు వెలువడినా, కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వారు ప్రచురించే గెజిట్‌లో అధికారికంగా ప్రకటించిన తర్వాతనే ఈ పురస్కారం అధికారికంగా లభించినట్లు భావిస్తారు.