చిరు వైసీపీలో చేరే అవకాశాలు ఉన్నాయా?అది సాధ్యమా..?
జస్ట్ ఈ వారం రోజుల నుంచీ ఓ వార్త ఏపీ రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.అది కూడా చిన్న చితకా న్యూస్ అయితే కాదు చాలా మంది పెద్ద తలలకు సంబంధించినదే.మూడో ప్రత్నామ్యాయం గా వచ్చి ఏపీ రాజకీయాల్లో ఏదో చేద్దామని రాజకీయ చదరంగంలో నలిగిపోయి వెనక్కి తగ్గి మళ్ళీ తనకి అచ్చొచ్చిన సినిమాలనే చేసుకుంటున్న చిరంజీవి కోసమే మంచి హాట్ టాపిక్ నడుస్తుంది.
చిరంజీవి రాజకీయాల్లో ఉన్నప్పుడు కంటే వాటికి దూరం అయిన తర్వాతనే అతని యొక్క ఉత్తమ గుణం తెలుగు ప్రజలకు తెలిసింది.అయినప్పటికీ తాను స్థాపించిన “ప్రజారాజ్యం” అనే పార్టీను విలీనం చేశారన్న మచ్చ చిత్రం తన జీవితాంతం మొయ్యక తప్పదు.అలా చిరు 2009 నుంచి రాజకీయాల్లోకి వచ్చి 2014 ఎన్నికల కల్లా సైలెంట్ గానే తన పనులు చేసుకుంటూ పోయారు.అప్పటికే ఏపీ రాజకీయ వర్గాల్లో పెను మార్పులు సంభవించాయి.
తాను ఉన్న కాంగ్రెస్ పార్టీ కాస్త ఏపీలో నామ రూపాలు లేకుండా పోయింది.పలు కొత్త పార్టీలు కూడా పుట్టుకొచ్చాయి.అలాంటి వాటిలో స్వయానా చిరు తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన కూడా ఒకటి.ఈ పార్టీ ద్వారానే పవన్ మరియు చిరుల రాజకీయ దారులు వేరని అందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చేసింది.
ఆ తర్వాత చిరు కాంగ్రెస్ పార్టీకు కూడా శాశ్వతంగా దూరమయ్యి సినిమాలు చేసుకుంటున్నారు.అయితే చిరు తాను సినిమాలు చేసుకుంటున్నప్పటి నుంచీ అధికారికంగా రాజకీయాల కోసం కానీ ఈ పార్టీ నాయకునికి సపోర్ట్ చేస్తున్నాను,ఈ పార్టీలో చేరాలనుకుంటున్నాను అని ఎక్కడా అన్న దాఖలాలు అయితే లేవు.
కానీ చిరు పేరును మాత్రం ఈ 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు అలాగే ఇప్పుడు ఎన్నికల తర్వాత కూడా రెండు పార్టీలు వాడుకుంటున్నాయి.ఎన్నికలకు ముందు చిరు బీజేపీ పార్టీలో చేరుతారని కొన్ని కథనాలు సర్క్యులేట్ అవ్వగా ఇప్పుడు వైసీపీ పార్టీలో చేరుతారని గట్టి వార్తలు వినిపిస్తున్నాయి.వీటిలో మొదటిది పక్కన పెడితే రెండో అంశాన్ని మాత్రం ఖచ్చితంగా పరిశీలించి తీరాల్సిందే…
చిరు వైసీపీలో చేరే అవకాశాలు ఉన్నాయా?అది సాధ్యమా..?
ఏపీలో ఇప్పుడున్న మూడు పార్టీలలో ఒకటి స్వయంగా చిరు ఇంటి నుంచి వెళ్ళినదే..(జనసేన పార్టీ)రాజకీయపరంగా పవన్ మరియు చిరు అభిప్రాయాలు వేరు కాబట్టి తాను వైసీపీకి మద్దతు ఇచ్చినా పెద్ద ఆశ్చర్య పోనక్కర్లేదు.అయితే ఈ టాపిక్ అంతటికీ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తన సినిమా కోసం తప్పితే అధికారికంగా చిరు జగన్ విషయంలో మరోసారి జోక్యం చేసుకున్నది లేదు.
అక్కడ నుంచీ మొదలయ్యాయి చిరు వైసీపీకి దగ్గరవుతున్నారని జగన్ రాజ్యసభ స్థానాన్ని కూడా చిరు కోసం హోల్డ్ చేసారని బోలెడు వార్తలు వచ్చేసాయి.దీనితో జనసేన మరియు సో కాల్డ్ మెగా లాయల్ ఫ్యాన్స్ మధ్య ఓ లాజికల్ టాపిక్ లేవనెత్తింది.ఒకవేళ చిరు జగన్ తో కలిస్తే ఎలాంటి అభ్యంతరమూ లేదని కేవలం చిరు అభిమానులు అంటున్నారు.పవన్ అన్నని ఎదిరించి సొంతంగా పార్టీను పెట్టుకోవచ్చు కానీ అన్నయ్య సొంతంగా ఒక పార్టీకు మద్దతు ప్రకటిస్తే తప్పేముంది అని ప్రశ్నిస్తున్నారు.
ఇందులో ఎలాంటి తప్పు లేదని చెప్పాలి.రాజకీయంగా వేరయినప్పుడు చిరు తాను ఏ నిర్ణయం తీసుకుంటారో అది ఆయన ఇష్టం.కానీ ఇప్పుడు చర్చించుకుంటున్న ఈ మాటలు అన్నీ గాల్లో కత్తులు దూసినట్టుగా ఉన్నాయి తప్ప చిరు నుంచి మాత్రం ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు.సో చిరు వైసీపీలో చేరుతారు,ఆయనకు రాజ్యసభ స్థానం అని బయటకొచ్చిన వార్తల్లో నిజం లేకపోవచ్చు,దీనితో పాటుగా మళ్ళీ రాజకీయ బురద నాకెందుకు అని చిరు కూడా అనుకోవచ్చు అది వేరే విషయం..అలాగే ఇక్కడ ఇంకో వెర్షన్ కూడా ఉంది..
కుటుంబం అంతా ఒక వైపు చిరు ఒకవైపు ఉండడం సాధ్యమా.?
ఇక్కడ కుటుంబం అంతా అనే మాట ఎందుకు వచ్చిందంటే చిరు మెగా కుటుంబంలో చిరునే పెద్ద.వారి కుటుంబంలో ఆయన మాటను ఎవరు జవదాటరు కానీ పవన్ మాత్రం రాజకీయంగా విభేదించి కొత్త పార్టీ పెట్టుకున్నాడు.దీనితో ఎన్నికల సమయం వరకు తన కుటుంబం నుంచి ఎవరు పవన్ కోసం మాట్లాడింది లేదు సపోర్ట్ చేసింది లేదు.
కానీ మెల్లమెల్లగా సెంటిమెంట్ ఎలాగో పని చేసింది.ఎన్నికల సమయానికల్లా ఒక్కొక్కరుగా పవన్ కోసం బయటకొచ్చి ప్రచారం చేసారు.రామ్ చరణ్,అల్లు అర్జున్ మొదలుకొని వరుణ్ తేజ్,నిహారికాల వరకు పవన్ కోసం వచ్చారు.అలాగే నాగబాబు కూడా పార్టీలో చేరి పవన్ కు ఒక అన్నగా జనసేన పార్టీ నాయకునిగా పని చేస్తానని చెప్పారు.ఇలా చిరు కుటుంబం నుంచి ఒక్క తాను తప్ప అంతా పవన్ వెంటే ఉన్నారు.
ఇక్కడ చిరు పవన్ కు సపోర్ట్ చెయ్యకపోడానికి కూడా పలు కారణాలు లేకపోలేవు.అప్పటికే తాను రాజకీయాల్లో దెబ్బ తిని ఉండడం మళ్ళీ ఈ రాజకీయాల గొడవలు మనకి ఎందుకులే వీరంతా సపోర్ట్ చేస్తున్నారని ఆగిపోయి ఉండొచ్చు.మరి ఇవన్నీ దాటుకొని చిరు పవన్ ను తనకి సపోర్ట్ చేసిన తన కుటుంబీకులని కాదని జగన్ కు జై కొడతారని అనుకోడం కూడా ఆలోచించదగ్గ అంశమే అని చెప్పాలి.ఫైనల్ గా మాత్రం చిరుపై జరుగుతున్న ఈ వార్తలలో ఎంత వరకు నిజముందో తెలియాలి అంటే చిరు నోరు విప్పాల్సిందే.