బోటులో డాన్సర్ నుంచి కొరియోగ్రాఫర్ రేంజ్ కి ఎదిగిన ఇతను ఎవరో తెలుసా?
ఏ పుట్టలో ఏ పాముందో ,ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలీదు. సరిగ్గా సికింద్రాబాద్, వారాసిగూడ కుర్రాడు పేరు విజయ్ కూడా అంతే. పాటలు వినిపిస్తే చాలు, అతని బాడీ స్క్రింగులా ఊగిపోయేది. మ్యూజిక్‌కి తగ్గట్టు, బాడీలో పార్టులన్నీ కదిలిపోయేవి. చిన్నప్పటి నుంచీ ఇంతే. ఎవరో సలహా ఇవ్వడంతో హైదరాబాద్ లుంబినీ పార్కుకు వెళ్లాడు. టాలెంట్ చూపించాడు. “బాగుందబ్బాయ్… రోజుకు రూ.50 ఇస్తాం. చేస్తావా” ఆనందంతో ఒకే అనేశాడు. వెంటనే బోటులో డాన్సర్‌గా చేరాడు. బోటు ఎక్కే పర్యాటకుల ముందు అతను డాన్స్ చేస్తుంటే… అంతా అతనివైపే చూసేవాళ్లు. చుట్టూ బుద్ధుడు, హుస్సేన్ సాగర్ అందాలున్నా, వాటిని చూడకుండా, అతన్నే చూసేవాళ్లు. అంతలా తన డాన్సుతో వాళ్లను కట్టిపడేసేవాడు.
“ఎన్నాళ్లిలా రోజువారీ రూ.50 వేతనంతో జీవిస్తావు. నీకు ఉన్న టాలెంట్ మామూలుది కాదు. ప్రయత్నించు. సాధించు” అంటూ ఓ రోజు ఎవరో ఇచ్చిన సలహా తో బాగా ఆలోచించాడు. తన డాన్సులను పర్యాటకులకే పరిమితం చెయ్యకూడదు. ప్రపంచానికి పరిచయం చెయ్యాలనుకున్నాడు. ఆ దిశగా అడుగులు వేశాడు. ఓవైపు జాబ్ చేస్తూనే మరోవైపు, సోదరుడు సంతోష్ కుమార్ సాయంతో వారాసిగూడలో వి 9 డాన్స్ స్టూడియో పెట్టాడు. హిప్‌హప్, కాంటెంపరరీ, సెమి క్లాసికల్, లిరికల్ హిప్‌హప్ వంటి డ్యాన్సుల్లో తనలాంటి యూత్‌కి, పిల్లలకూ ట్రైనింగ్ ఇస్తున్నాడు. క్రమంగా అతని పేరు టాలీవుడ్‌లో మారుమోగిపోవడంతో స్టూడియో గ్రాండ్ సక్సెస్ అయ్యింది.
ఇక అదే ఊపులో ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా, మణికొండ, హబ్సిగూడల్లో కూడా బ్రాంచ్‌లు ఏర్పాటు చేసి వేల మందికి ట్రైనింగ్ స్టార్ట్ చేసాడు. అనుకోకుండా 2012లో టాలీవుడ్ నుంచీ పిలుపొచ్చింది. అప్పటి నుంచీ ఇప్పటివరకూ 150 సినిమాల్లో డాన్సర్‌గా నటించాడు. మిర్చి, కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాల్లో ప్రభాస్, పవన్‌కళ్యాణ్‌తో స్టెప్పులేశాడు. అంతేకాదు, కొరియోగ్రాఫర్‌గా అవతరించాడు. చచ్చిందిగొర్రె, తమిళతంబి వంటి సినిమాలతోపాటు రోల్ రైడ ఆల్బమ్స్‌కు కొరియోగ్రాఫర్‌గా చేస్తున్నాడు.అలాగే టీవీ ఛానెళ్లలో కూడా ‘ఢీ’ లాంటి ప్రోగ్రామ్‌ను పిల్లలతో చేస్తున్నాడు. తన స్టూడియోలో పిల్లలకు ఫ్రీగా డాన్స్ ట్రైనింగ్ ఇస్తున్నాడు. దటీజ్ విజయ్ అంటూ పలువురు హేట్సాఫ్ చెబుతున్నారు.