Movies

నరసింహనాయుడు సినిమా వెనక ఉన్న కొన్ని నమ్మలేని నిజాలు

చిన్నికృష్ణ అంటే వెంటనే గుర్తుకురాకపోవచ్చు కానీ రజినీకాంత్ నరసింహ, అల్లు అర్జున్ గంగోత్రి, చిరంజీవి ఇంద్ర సినిమాల స్టోరీ రైటర్ అంటే మాత్రం వెంటనే ఫ్లాష్ అవుతుంది. అప్పట్లో ట్రెండ్ సెట్ చేసిన ఇలాంటి ఇండస్ట్రీ హిట్స్ కి పనిచేసిన అనుభవం ఆయనది. నందమూరి బాలకృష్ణ నరసింహనాయుడుకు కథ అందించింది కూడా ఈయనే. దీనికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన సంగతులు ఉన్నాయి. సమరసింహారెడ్డి లాంటి ఆల్ టైం రికార్డు క్రియేటర్ తర్వాత దర్శకుడు బి గోపాల్ మరోసారి బాలయ్యతో చేయాలని నిర్ణయించుకున్నారు. కథల కోసం విపరీతంగా అన్వేషిస్తున్నారు. పరుచూరి బ్రదర్స్ తో మొదలుపెట్టి సత్యమూర్తి, విజయేంద్రప్రసాద్ లాంటి ఎందరో ఉద్దండులు ఏవో సబ్జెక్టులు చెబుతున్నారు కానీ ఆయనకు ఒక పట్టాన నచ్చడం లేదు.

బి గోపాల్ ని ఒప్పించడం కన్నా ఏదైనా గుడి మెట్ల వద్ద కూర్చోవడం నయమన్న అభిప్రాయం అప్పట్లో చాలా మందిలో ఉండేది. ఆ సమయంలో బాలయ్య కోసం కథ వినిపించడానికి ఫిలిం ఛాంబర్ కు వెళ్లారు చిన్నికృష్ణ. ముందు గోపాలకృష్ణ విన్నారు. చిన్న పిల్లాడి కోసం తన ప్రాణాన్ని సైతం లెక్క చేయని కథానాయకుడి లక్షణం ఆయనకు విపరీతంగా నచ్చింది. స్టోరీ మొత్తం ఓపిగ్గా విన్నారు. వెంటనే గోపాల్ దగ్గరికి వెళ్లి సబ్జెక్టు అద్భుతంగా ఉందని వెంటనే మొదలుపెట్టేయమని చెప్పేశారు గోపాలకృష్ణ. అప్పటికే పోసాని కృష్ణమురళి రచయితగా ముందు ఓ పోలీస్ కాన్సెప్ట్ తో అనుకుని ఓపెనింగ్ కూడా చేశారు. తర్వాత అది క్యాన్సిల్ అయ్యింది. అందుకే బి గోపాల్ ఒకరకమైన ఒత్తిడిలో ఉన్నారు. చిన్నికృష్ణ చెప్పిన కథ ఆయనకు విపరీతంగా నచ్చేసింది. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

అటువైపు బాలకృష్ణకు కూడా ఇది కనెక్ట్ అయిపోయింది. అలా చిన్నికృష్ణ కథ నరసింహనాయుడుగా రూపుదిద్దుకుంది. ఫ్యాక్షన్ కథే అయినప్పటికీ దర్శకులు బి గోపాల్ ఎమోషన్స్ ని బాలన్స్ చేసిన తీరు, మాస్ ఆడియన్స్ కి కావాల్సిన ఎపిసోడ్స్ ని కూర్చిన విధానం, మణిశర్మ సంగీతం, పరుచూరి సంభాషణలు బాక్స్ ఆఫీస్ దగ్గర కనక వర్షం కురిపించేలా చేశాయి. అప్పటిదాకా ఉన్న రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. తమ నమ్మకాన్ని నిలబెట్టిన చిన్నికృష్ణపై హీరో నుంచి యూనిట్ దాకా అందరూ ప్రశంసల జల్లు కురిపించారు. తర్వాత ఎక్కువ కాలం ఇలాంటి కథలే ఇవ్వలేకపోయినా ఉన్న నాలుగైదులోనే మర్చిపోలేని బ్లాక్ బస్టర్స్ అందుకున్న చిన్నికృష్ణ ఆయా హీరోల అభిమానులకు గుర్తుండే పేరే. అలాంటి పవర్ ఫుల్ కథలు ఇచ్చాడు మరి.