మనవాళ్ళు బాలీవుడ్ లో సక్సెస్ కాకపోవడానికి కారణాలు ఇవే

‘బాహుబలి’ సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ గా మారిన హీరో ప్రభాస్ తర్వాత ‘సాహో’ తో బాలీవుడ్‌లో సత్తా చాటాడు. ఇపుడు ఏకంగా ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ అనే డైరెక్ట్ హిందీ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే ప్రభాస్ కంటే ముందు చాలామంది టాలీవుడ్ హీరోలు బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చినా ఎవరూ నిలదొక్కుకోలేదు. హీరోయిన్స్ లో శ్రీదేవి,జయప్రద లాంటి వాళ్ళు బాలీవుడ్ లో తమ సత్తా చాటారే తప్ప హీరోలకు పెద్దగా అచ్చిరాలేదనే చెప్పాలి. ఎన్టీఆర్ కూడా హిందీలో ’చండీరాణి’, ’నయా ఆద్మీ’ వంటి సినిమాలతో డైరెక్ట్‌గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అక్కినేని నాగేశ్వరరావు కూడా తెలుగులో హిట్టైన ‘సువర్ణ సుందరి’ సినిమాను అదే టైటిల్‌తో హిందీలో రీమేక్ చేసి సక్సెస్ కొట్టారు. ఎన్టీఆర్, బాలకృష్ణ హీరోలుగా హిందీలో ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమా తీసినప్పటికీ బాలీవుడ్‌లో విడుదల కాలేదు.

ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ .. భరతుడి పాత్ర వేసాడు. తర్వాత జనరేషన్ లో చూస్తే,.. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగా .. నాగార్జున హిందీ సినిమాల్లో నటించి.. ఓ లెవెల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘శివ’ సినిమా హిందీ రీమేక్ ‘శివ’ మూవీతో బాలీవుడ్ లో ఎంటరయ్యాడు. ఆ తర్వాత 1992 లో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ తో కలిసి.. ‘ఖుదాగవా’ సినిమాలో నటించాడు.

ఇక టాలీవుడ్ లో తిరుగులేని ఇమేజ్ ఉన్న మెగాస్టార్ చిరంజీవి మొత్తం 3 హిందీ సినిమాలు చేసినా, అంతగా ప్రభావం చూపలేకపోయాడు. తెలుగులో రాజశేఖర్ హీరోగా వచ్చిన అంకుశం చిత్రాన్ని హిందీలో ‘ప్రతిబంద్’ పేరుతో రీమేక్ చేసి హిట్ కొట్టాడు. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన, గ్యాంగ్ లీడర్ సినిమా హిందీలో ఆజ్ కా గూండారాజ్ టైటిల్ తో రీమేక్ చేసాడు. అక్కడ కూడా భారీ హిట్ ను సొంతం చేసుకున్నాడు మెగాస్టార్. ఇక బాలీవుడ్ లో చిరంజీవి థార్డ్ అండ్ ఫైనల్ మూవీ.. ది జెంటల్మెన్. ఈ మూవీ అంతగా సక్సెస్ కాలేదు. దీంతో అక్కడితో అపేసాడు. టోటల్‌గా హిందీలో మెగాస్టార్ చేసినవి రీమేక్స్ కావడం విశేషం.

ఇక వెంకటేష్. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్టైన ’చంటి ’మూవీని, అనారీ టైటిల్ తో హిందీలో రీమేక్ చేసి.. సూపర్ సక్సెస్ కొట్టాడు. అనారీ ఇచ్చిన ఊపుతో తెలుగులో హిట్టయిన ‘యమలీల’ సినిమాకు రీమేక్ ‘తక్దీర్ వాలా’ అనే మరో సినిమా రీమేక్ చేసాడు. అయితే బాలీవుడ్ లో ప్లాప్ గా నిలిచింది. దీంతో బాలీవుడ్ కు వెంకీ దూరంగా జరిగాడు.

వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించిన ‘శివ’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జెడీ చక్రవర్తి ఆతర్వాత వర్మ తెరకెక్కించిన ‘సత్య’ మూవీతో హిందీలో హీరో అయ్యాడు. ఆ తర్వాత పలు హిందీ సినిమాల్లో నటించాడు. చిరంజీవి హీరోగా హిందీలో తెరకెక్కిన ‘ఆజ్ కా గూండారాజ్’ సినిమాలో చిరు స్నేహితుడి పాత్ర తో రవితేజా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఫైటర్’ మూవీతో విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నా, ఇది డైరెక్ట్ హిందీ చిత్రం కాదు. ‘పుష్ప’ సినిమాతో అల్లు అర్జున్ తొలిసారి ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇది కూడా డైరెక్ట్ హిందీ చిత్రం కాదు.

రానా దగ్గుబాటి.. హిందీలో ‘దమ్ మారో దమ్’, ‘డిపార్ట్‌మెంట్’, ‘బేబి’ ‘ఏ జవానీ హై దీవానీ’, ‘ఘాజీ ‘హౌస్‌పుల్4’ వంటి డైరెక్ట్‌ హిందీ మూవీస్ చేసాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా బిగ్‌బీ నటించిన ఆల్ టైమ్ క్లాసిక్ ‘జంజర్’ సినిమాను అదే ‘జంజీర్’ పేరుతో రీమేక్ చేసి డైరెక్ట్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి, నిలబడలేకపోయాడు. వర్మ తెరకెక్కించిన ‘ఆగ్యాత్’ మూవీతో బాలీవుడ్‌లో నితిన్ నిలవలేదు. ఇక ప్రభాస్ ఆదిపురుష్ మూవీ రామాయణ గాథ ఆధారంగా డైరెక్ట్ హిందీ మూవీగా తెరకెక్కుతోంది. శ్రీరాముడిగా ప్రభాస్ నటించబోతున్నట్టు దర్శకుడు చెప్పేసాడు. రెమ్యూనరేషన్ ఎక్కువ, దేశవ్యాప్త ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవచ్చన్న ఆశతో గతంలో కన్నా ఇప్పుడు బాలీవుడ్ మీద మన హీరోలకు మోజు కి కారణమని విశ్లేషిసున్నారు.