జయసుధ గురించి మనకు తెలియని షాకింగ్ నిజాలు

ప్రియురాలిగా కవ్వించినా… ఇల్లాలిగా కనిపించినా… మాతృమూర్తిని మరిపించినా…. ఆడపడుచుగా అలరించినా…ఆమె శైలి ప్రత్యేకం. సహజమైన నటనకు చిరునామా ఆమె. అందుకే తెలుగు ప్రజలు ఆమెను సహజనటిగా పిలుచుకుంటూ.. సొంతమనిషిగా భావిస్తారు. ఆమే జయసుధ. 1972లో లక్ష్మీదీపక్‌ దర్శకత్వంలో కృష్ణ హీరోగా నటించిన ‘పండంటికాపురం’ సినిమాలో జమున కుమార్తెగా ఆమె తెరమీద కొచ్చారు.

ఆ తర్వాత అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. సావిత్రి తర్వాత అలాంటి పాత్రల్లో నటించిన నటిగా జయసుధకు పేరొచ్చింది. ఐదు నంది అవార్డులు, ఆరు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు, ఇతర అవార్డులు ఆమెను వరించాయి.

జయసుధ అసలు పేరు సుజాత. 1959లో డిసెంబరు 17న మద్రాస్‌లో జన్మించారు. పుట్టింది పెరిగింది మద్రాసులో అయినా మాతృభాష తెలుగే. నటి, నిర్మాత విజయనిర్మల జయసుధకు మేనత్త. జయసుధ 12 ఏళ్లకే ‘పండంటికాపురం’ చిత్రంతో వెండితెరపై కనిపించారు. తర్వాత కమల్‌హాసన్‌ హీరోగా కె.బాలచందర్‌ తెరకెక్కించిన ‘అరంగేట్రం’ అనే తమిళ చిత్రంలో ఓ పాత్ర పోషించారు. తర్వాత పలు చిత్రాల్లో చిన్న పాత్రల్లో నటించి తన నటనకు మంచి మార్కులు తెచ్చుకున్నారు.
కథానాయికగా..
జయసుధ 1975లో ‘లక్ష్మణరేఖ’ చిత్రంతో కథానాయికగా తొలిసారి ప్రేక్షకులకు కనిపించారు. ఈ చిత్రం ఆమెకు తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి అవకాశాలు కల్పించింది. ‘అడవిరాముడు’, ‘ప్రేమాభిషేకం’, ‘శివరంజని’, ‘విచిత్రజీవితం’, ‘యుగంధర్‌’, ‘మేఘసందేశం’, ‘సుభాషిణి’.. ఇలా దాదాపు అనేక తెలుగు చిత్రాల్లో జయసుధ నటించారు.దర్శకరత్న దాసరి నారాయణరావు తన సినిమాల్లో జయసుధను ఎక్కువగా తీసుకునేవారు. అంతేకాదు తమిళ, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాల్లోనూ నటించారు. పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.