పొట్టి వీరయ్య లైఫ్ ని మార్చిన స్టార్ హీరో ఎవరో తెలుసా ?

potti veeraiah Unknown facts :ఇతని పేరు గట్టు వీరయ్య.. కానీ మరుగుజ్జు కావడంతో పొట్టి వీరయ్యగా పేరుపొందాడు. దాదాపు 400 సినిమాల్లో నటించిన వీరయ్య సూర్యాపేట జిల్లాలో ఫణిగిరి గ్రామంలో సింహాద్రి, నరసమ్మ దంపతులకు పుట్టాడు. అక్కడే నాల్గవ తరగతి వరకూ చదివాడు. సూర్యాపేటలో పదవ తరగతి వరకూ చదివాడు. అయితే పాస్ కాలేదు. ఉద్యోగం కోసం 1967లో మద్రాసు వచ్చేసాడు. బాగా తెలిసిన మంగళ్ పాలన్ అనే వ్యక్తి దగ్గర చేరాడు.

మంగళ్ పాలన్ పెళ్లిళ్లకు, సినిమాలకు పూల అలంకరణ చేసేవాడు. రోజుకి 90పైసలు కూలి దక్కేది. పక్కనే గోల్డెన్ స్టూడియో ఉండడం వలన తరచూ అక్కడికి వెళ్ళినపుడు సినిమా ఛాన్స్ లు అడగాలని చూసేవాడు. అలా ఒకరోజు అందాల నటుడు శోభన్ బాబు కంటపడ్డాడు. తన చదువు, ఉద్యోగం, నటన మీద ఆసక్తి అన్నీ వివరించి, తనకు నటించే ఛాన్స్ ఇప్పించాలని కోరాడు.

అయితే ఇక్కడ నీలాంటి వాడికి ఛాన్స్ లు కష్టమని, అందుకే బి విఠలాచార్యను కలవమని శోభన్ బాబు సూచించడంతో వీరయ్య అలాగే చేసాడు. అగ్గివీరుడు మూవీతో వీరయ్యకు ఛాన్స్ ఇస్తూ, 500రూపాయలు ఇచ్చాడు. అలా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ తదితర భాషల్లో 400చిత్రాల్లో నటించాడు. ఎన్టీఆర్, అక్కినేని, ఎంజీఆర్ , శివాజీ గణేశన్ , తదితర స్టార్ హీరోల సినిమాల్లో చేసాడు. మల్లికా అనే ఆమెను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. ముగ్గురు పిల్లలు. మల్లికా 2006లో కన్నుమూసింది.