Kitchenvantalu

kakarakaya vellulli fry:కాకరకాయ వెల్లుల్లి తో ఇలా ఫ్రై చేస్తే రుచి అదిరిపోతోంది

kakarakaya vellulli fry:కాకరకాయ వెల్లుల్లి తో ఇలా ఫ్రై చేస్తే రుచి అదిరిపోతోంది.. కాకరకాయ చేదుగా ఉంటుందని తినటానికి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇప్పుడు చెప్పే విధంగా చేసుకుంటే అందరూ ఇష్టంగా తింటారు.

కావలసిన వస్తువులు
కాకర కాయలు – పావుకిలో
వెల్లుల్లి రెబ్బలు – పది
మినప్పప్పు – రెండు చెంచాలు
పల్లీ పొడి – 3చెంచాలు
ఉల్లిపాయ – ఒకటి
కారం పొడి – రెండు చెంచాలు
ఉప్పు – తగినంత
నూనె – 5-6 చెంచాలు
కరివేపాకు – ఒక రెబ్బ
పసుపు – పావు చెంచా

తయారీ విధానం:
కాకరకాయల్ని గుండ్రంగా పల్చగా ముక్కలుగా కోసుకోవాలి.ఒక మూకుడు పెట్టుకుని వేడయ్యాక అందులో 5స్పూన్ల నూనె వేసుకుని కాకరకాయలు వేసుకోవాలి.కొంచెం ఉప్పు వేసుకుని కలుపుకోవాలి.

మంట పెద్దగా పెట్టుకుని కాకరకాయ ముక్కలు నూనెలో బాగా ఉడికి ముక్క కొంచెం గోల్డ్ కలర్ వచ్చి డీ ఫ్రై చేస్కున్నట్లుగా అయ్యేవరకు బాగా కలుపుకుంటూ ఉండాలి. కాకరకాయ ముక్కలు ఫ్రై అయ్యాక ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు అదే మూకుడులో అర చెంచా నూనె వేసుకుని మినపప్పు వేసుకుని వేయించుకోవాలి.

ఉల్లిపాయలు, కరివేపాకు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి.ఉల్లిపాయలు వేగాక కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసి ఒక నిమిషం వేగనివ్వాలి. ఇప్పుడు వేయించుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకుని కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి.కాకరకాయ ముక్కలు ముందుగానే ఉడికాయి కాబట్టి ఎక్కువసేపు ఆగకుండా కావలసినంత కారం పొడి వేసుకుని కలుపుకోవాలి.

మంట సిమ్ లో పెట్టుకుని అడుగు అంటకుండా కలుపుకుంటూ ఉండాలి. 2-3 నిమిషాల తరువాత వేయించి పొడి చేసుకున్న పల్లీల పొడిని వేసుకుని బాగా కలుపుకోవాలి.ఒక 3-4 నిమిషాలు ఆగి దింపేసుకుంటే సరిపోతుంది.ఇది వేడి వేడి అన్నం లో, చపాతీ లో తింటే చాలా బాగుంటుంది.