Kitchenvantalu

Pattu Sarees: డ్రై క్లీనింగ్ అవసరం లేకుండా.. ఇంట్లోనే పట్టుచీరలను పదిలంగా ఉతుక్కోవచ్చు .. అది ఎలా అంటే..!

How to Clean Pattu Sarees at home:శుభకార్యాల వేళ పట్టు బట్టలు ధరించటం మన సంప్రదాయం. అయితే.. సాధారణంగా పట్టు బట్టలమీద మరకలు పడితే ఓ పట్టాన వదిలిపోవు . అలాగని వీటిని నూలు దుస్తుల్లా ఎడాపెడా ఉతకనూ లేము. అందుకే ఎంతో డబ్బుపోసి కొన్న పట్టు బట్టలు ఉతికేటప్పుడు, ఆరేసేటప్పుడు, లోపల దాచే విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. అప్పుడే అవి పదికాలాల పాటు మన్నికగా ఉంటాయి.

ఉతికేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు
పట్టుచీరలను చెరువు, నది నీటితోనే ఉతకాలి. బోరునీటితో ఉతికేవారు ఆ నీటిలో చిటికెడు బోరాక్స్ కలపాలి. నాణ్యమైన, తేలికపాటి సబ్బును ద్రవ లేదా పొడి రూపంలో వాడాలి. బోరునీరైతే తేలికపాటి డిటర్జెంట్ వాడాలి. పట్టు బట్టలు ఉతికిన తరువాత చేతితో సున్నితంగా పిండి నీడ పట్టున ఆరేయాలి.

ఇలా చేస్తే మరకలు మాయం
పట్టు బట్టల మీద కాఫీ లేదా టీ మరకలు పడితే కార్బన్ టెట్రాక్లోరైడ్ ను పూస్తే మరకలు పోతాయి. అప్పటికీ పోకపోతే వేడినీటిలో కొద్దిగా హైడ్రోజన్ పెరాక్సైడ్‌ వేసి ఆ నీటితో ఉతకాలి.

పట్టు బట్టల మీద చాక్‌లెట్ మరకలు పడితే వేడి నీటిలో జాడించి ఉతికితే పోతాయి. అదే..పెరుగు, వెన్న వంటి మరకలు పడితే ఆ భాగంలో ఒక చుక్క కార్బన్ టెట్రాక్లోరైడ్‌ని ఉపయోగించాలి.

పట్టు బట్టల మీద ఇంక్ లేదా లిప్‌స్టిక్ మరకలు పడితే ఆ భాగంలో పేపర్ టవల్‌ను ఉంచి వెనుకనుంచి డ్రైక్లీనింగ్ ద్రావణం లేదా ఆల్కహాల్‌ పూయాలి. మరక పూర్తిగా పోయేవరకు నీటిని వాడరాదు. అదే నెయిల్ పాలిష్ పడితే ఆ భాగం వరకు అసిటోన్‌ లో ముంచితే సరిపోతుంది.

బురద మట్టి మరకలు పడితే పట్టు వస్త్రాన్ని ఆరనిచ్చి కార్బన్ టెట్రాక్లోరైడ్ తో తుడిచి ఉతికితే సరిపోతుంది.

షూ పాలిష్ మరకలు పడితే కొద్దిగా లిక్విడ్ డిటర్జెంట్ వేసి రుద్ది ఆ తర్వాత ఆల్కహాల్ పూయాలి.

భద్రపరిచేదెలా?
పట్టుబట్టలను ప్లాస్టిక్ సంచుల్లో గాక పేపర్ లేదా కాటన్ సంచుల్లోనే ఉంచాలి.
పట్టుబట్టలున్న చోట ఎక్కువ గాలి, కాంతి లేకుండా చూడాలి.
పట్టు బట్టలను చెక్క లేదా కలపతో చేసిన పెట్టె లేదా బీరువాలో నేరుగా తాకేలా గాక కవరులో పెట్టి పెట్టాలి.
పట్టు బట్టలను అప్పుడప్పుడు బయటకు తీసి గాలి సోకనీయాలి.లేకుంటే మడతలు పడిన చోట చిరుగులు పడే అవకాశం ఉంది.