ఆంధ్రా స్పెషల్: గోంగూరలో నువ్వులు వేసి ఇలా పచ్చడి చేశారంటే.. అన్నం మొత్తం దీనితోనే లాగించేస్తారు!
గోంగూర పేరు చెబితేనే ఆంధ్రా వాళ్లకు నోరూరిపోతుంది కదూ! అందులోనూ ‘గోంగూర నువ్వుల పచ్చడి’ రుచి చూశారంటే.. మళ్లీ మళ్లీ అదే కావాలంటారు.
వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి, ఈ పచ్చడి వేసుకుని తింటే ఆ మజాయే వేరు. పైగా ఈ పచ్చడిని ఒక్కసారి చేసుకుంటే ఫ్రిజ్ తో పనిలేకుండా దాదాపు 15 రోజుల పాటు నిల్వ ఉంటుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ సూపర్ టేస్టీ, నోరూరించే ఆంధ్రా స్టైల్ గోంగూర నువ్వుల పచ్చడిని ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం!

కావాల్సిన పదార్థాలు:
గోంగూర: 2 కట్టలు
నువ్వులు: 1/4 కప్పు
పచ్చి మిరపకాయలు: 15 (మీ కారానికి తగినట్టుగా)
వెల్లుల్లి రెబ్బలు: 8-10
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: పచ్చడి వేయించడానికి తగినంత (సుమారు 3 టేబుల్ స్పూన్లు)

తాలింపు కోసం:
మినపప్పు – 1 స్పూన్
శనగపప్పు – 1 స్పూన్
ఆవాలు – 1/2 టీస్పూన్
జీలకర్ర – 1/2 టీస్పూన్
ఎండు మిరపకాయలు – 2
కరివేపాకు – 2 రెమ్మలు
పసుపు – 1/2 టీస్పూన్
తయారీ విధానం:
ముందుగా గోంగూర ఆకులను వొలుచుకుని, నీళ్లలో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అందులో తడి లేకుండా చూసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని, నువ్వులు వేసి దోరగా (డ్రై రోస్ట్) వేయించుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.
అదే పాన్‌లో ఒక స్పూన్ నూనె వేసి, పచ్చిమిరపకాయలను ముక్కలుగా తుంచి వేసి వేయించాలి. ఇవి వేగాక పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు అదే పాన్‌లో మరో స్పూన్ నూనె వేసి, ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర ఆకులు, వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా మగ్గనివ్వాలి. గోంగూర దగ్గరపడి ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారనివ్వాలి.

చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని.. అందులో వేయించిన నువ్వులు, పచ్చిమిర్చి, ఉడికించిన గోంగూర, వెల్లుల్లి మరియు తగినంత ఉప్పు వేసి మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి.
ఇప్పుడు తాలింపు కోసం పాన్‌లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. అందులో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేగించాలి. ఆ తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు వేసి చిటపటలాడాక.. ఆ తాలింపును తీసుకెళ్లి మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న పచ్చడిలో కలపాలి.
ఇవి కూడా చదవండి:
అంతే! గుమగుమలాడే గోంగూర నువ్వుల పచ్చడి రెడీ. ఈ వీకెండ్ లో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి, మీ ఇంట్లో వాళ్ళకి వడ్డించండి.. వావ్ అనాల్సిందే!
చిన్న చిట్కా: పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే.. గోంగూరను కడిగాక తడి లేకుండా ఆరబెట్టుకోవాలి, అలాగే పచ్చడి తీసే స్పూన్ కు కూడా తడి తగలకుండా చూసుకోవాలి.

