ఉదయం చేసిన చపాతీ సాయంత్రం వరకు మెత్తగా, దూదిలా ఉండాలా? అయితే ఈ చిన్న ట్రిక్స్ పాటించండి!
చపాతీలు వేడిగా ఉన్నప్పుడు మెత్తగానే ఉంటాయి, కానీ కాస్త చల్లారగానే అప్పడాల్లా గట్టిగా మారిపోతుంటాయి. ఆఫీస్‌కు లేదా పిల్లల లంచ్ బాక్స్‌లో పెట్టిన చపాతీలు మధ్యాహ్నానికి రబ్బరులా తయారవుతాయి.
అయితే, వంటగదిలో కొన్ని చిన్నపాటి చిట్కాలు పాటిస్తే ఉదయం చేసిన చపాతీలు సాయంత్రం వరకు దూదిలా మెత్తగా ఉంటాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.

చపాతీలు మెత్తగా రావాలంటే పాటించాల్సిన చిట్కాలు:
గోరువెచ్చని నీళ్లు లేదా పాలు: పిండిని ఎప్పుడూ చల్లటి నీటితో కలపకూడదు. కాస్త గోరువెచ్చని నీటితో కలుపుకుంటే పిండి మృదువుగా మారుతుంది. ఇంకా బాగా రావాలంటే, సగం నీళ్లు మరియు సగం కాచి చల్లార్చిన పాలు పోసి కలపండి. చపాతీలు భలే సాఫ్ట్‌గా వస్తాయి.
నూనె లేదా నెయ్యి : పిండి కలుపుకునేటప్పుడు ఒక చెంచా నూనె లేదా నెయ్యి వేసి బాగా కలపడం వల్ల పిండికి తగినంత తేమ అందుతుంది. ఇది చపాతీలు ఎక్కువసేపు డ్రై అవ్వకుండా కాపాడుతుంది.
పిండికి విశ్రాంతి (Resting Time): చాలామంది చేసే పొరపాటు.. పిండి కలిపిన వెంటనే చపాతీలు చేయడం. పిండిని ముద్దలా చేశాక, దానిపై ఒక తడి కాటన్ వస్త్రాన్ని కప్పి కనీసం 20 నుండి 30 నిమిషాల పాటు పక్కన ఉంచాలి. దీనివల్ల గోధుమల్లోని గ్లూటెన్ రిలీజ్ అయి చపాతీలు మృదువుగా పొంగుతాయి.

మరీ పల్చగా వత్తకూడదు: చపాతీలను మరీ పల్చగా, పేపర్‌లాగా పామకూడదు. అలా చేస్తే కాల్చేటప్పుడు గట్టిపడిపోతాయి. కాస్త మందంగా ఉండేలా చూసుకుంటేనే పొరలు పొరలుగా వస్తాయి.
మంట ఎప్పుడూ హై ఫ్లేమ్‌లోనే: పెనం బాగా వేడెక్కిన తర్వాతే చపాతీ వేయాలి. సిమ్ (Sim) లో పెట్టి కాల్చితే చపాతీలు అప్పడాల్లా గట్టిపడతాయి. కాబట్టి మీడియం లేదా హై ఫ్లేమ్ మీద మాత్రమే అటూ ఇటూ త్వరగా కాల్చుకోవాలి. కాల్చేటప్పుడు నెయ్యి రాస్తే రుచితో పాటు మెత్తదనం కూడా పెరుగుతుంది.
నిల్వ చేసే విధానం: కాల్చిన చపాతీలను నేరుగా గిన్నెలో లేదా హాట్ బాక్స్‌లో పెట్టేయకూడదు. బాక్స్ అడుగున ఒక పొడి కాటన్ క్లాత్ వేసి, అందులో చపాతీలు ఉంచి క్లాత్‌తో కప్పేయాలి. చపాతీల వేడికి పుట్టే ఆవిరిని ఈ క్లాత్ పీల్చుకుని, వాటిని సాయంత్రం వరకు ఫ్రెష్‌గా ఉంచుతుంది.
ఈ చిన్న ట్రిక్స్ ఫాలో అయ్యి ఈసారి చపాతీలు చేసి చూడండి. ముసలి వాళ్ళు కూడా ఎంతో ఈజీగా తినగలిగేలా నోట్లో వేస్తే కరిగిపోతాయి!
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

