రోజంతా యాక్టివ్‌గా ఉంచే పవర్‌ఫుల్ బ్రేక్‌ఫాస్ట్.. ఎర్ర బియ్యం, చిరుధాన్యాల అడై
Red Rice Millet Adai: ఆరోగ్యకరమైన, రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్ కోసం చూస్తున్నారా? అయితే ‘రెడ్ రైస్ మిల్లెట్ అడై’ మీకు సరైన ఎంపిక. ఎర్ర బియ్యం, చిరుధాన్యాలు (మిల్లెట్స్), వివిధ రకాల పప్పు దినుసుల కలయికతో చేసే ఈ అడై (దోశ) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఫైబర్, ప్రోటీన్లు, ఐరన్ పుష్కలంగా ఉండే ఈ టిఫిన్ ఉదయాన్నే ఒక్కటి తిన్నా చాలు.. శరీరంలో పోషకాల లోపం అనేదే ఉండదు.
దీన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవడం వల్ల నీరసం తగ్గి రోజంతా ఎంతో ఉత్సాహంగా, యాక్టివ్‌గా ఉంటారు. బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిస్ ఉన్నవారికి కూడా ఇది బెస్ట్ ఆప్షన్. వేడి వేడి అడైని పల్లి చట్నీ లేదా అల్లం పచ్చడితో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ నచ్చే ఈ సూపర్ హెల్తీ రెసిపీని మీ డైట్‌లో తప్పకుండా చేర్చుకోండి!

ఎప్పుడూ మినపప్పుతో చేసే, ఇడ్లీలు వడలు దోశలు కాకుండా, ఫైబర్ పుస్టిగా ఉండే, రెడ్ రైస్, మిల్లెట్స్ తో,అడై చేసుకోండి.
కావాల్సిన పదార్ధాలు
కందిపప్పు ( నానపెట్టిన) – 1/4కప్పు
ఎర్రబియ్యం ( నానపెట్టిన) -1/4కప్పు
కొర్రలు( నానపెట్టిన) – 1/4కప్పు
ఎండుమిర్చి – 7
అల్లం – 1 ఇంచ్
వెలుల్లి – 15
కరివేపాకు – 2 రెమ్మలు
ఉప్పు – తగినంత
సోంపు – ½ టేబుల్ స్పూన్
ఉల్లిపాయ – 1
నూనె – తగినంతా
తయారీ విధానం
1.మిక్సీలో అడైకి కావాల్సిన పదార్ధాలు అన్ని వేసి, కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
2.రుబ్బుకున్న పిండిని అవసరం అయితే, కాస్త పలచగా చేసుకోవాలి.
3.స్టవ్ పై పెనం పెట్టుకుని, వేడి చేసి, అడై పిండిని, కాస్త్ మందంగా వేసుకోవాలి.
4.పిండి వేసిన వెంటనే, ఉల్లి పచ్చిమిర్చి, సన్నని తరుగులా చల్లుకుని, అంచుల వెంట,నూనె కాని, నెయ్యి కాని వేసి, కాల్చుకోవాలి.
5. ఒక వైపు కాలిన తర్వాత అడైని, రెండవ వైపు తిప్పుకోవాలి.
6. అంతే వేడి వేడి అడై తయారైనట్లే.

