Movies

ఎన్టీఆర్ తన చివరి శ్వాస వరకు నమ్మిన ఏకైన వ్యక్తి ఎవరో తెలుసా?

ఎవరి జీవితంలోనైనా ఒక్కొక్కరితో సాన్నిహిత్యం ఒక్కోలా ఉంటుంది. కొందరు జీవితం చివరి వరకూ కొందరిని నమ్ముతారు. అందరికీ అన్ని విషయాలు చెప్పలేరు. ఇక ఇన్నాళ్లూ నట జీవితంలో ఇంతటి స్థాయికి దోహదపడ్డ ప్రజలకు ఏదైనా చేయాలన్న తపన ఎన్టీఆర్ కి ఉండేది. ప్రజా జీవితం పట్ల మక్కువ ఉండేది. కొందరి దగ్గర ఇలాంటి విషయాలను ప్రస్తావించేవారు. ఇక ఒకరిద్దరి సన్నిహితుల దగ్గర కీలక విషయాలు పంచుకునేవారట. ఓసారి షూటింగ్ కి కులుమనాలి వెళ్లారు. ఇలా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఒక వ్యక్తిని తప్పకుండా తీసుకెళ్లేవారు.

కులు మనాలి వెళ్ళినప్పుడు అందులో ప్రముఖ నిర్మాత అట్లూరి పుండరీకాక్షయ్య, ఆయన సోదరుడు బలరాం లతో పాటు బివి మోహన్ రెడ్డి కూడా ఉన్నారు. కర్నూల్ జిల్లాకు చెందిన బివి మోహన్ రెడ్డి పూర్తిపేరు బైరెడ్డి విష్ణు మోహన్ రెడ్డి. జ్యోతిష్యం కూడా తెల్సిన మోహన్ రెడ్డి అంటే రామారావుకి చాలా ఇష్టం. నిజానికి రాజకీయ నేతలందరితో మోహన్ రెడ్డికి పరిచయాలున్నాయి.

అప్పటి సీఎం జలగం వెంగళరావు తో సన్నిహిత సంబంధాలుండేవి. ఇక ఎన్టీఆర్ అంటే వల్లమాలిన ప్రేమ. ఆరాధనా భావం కూడా ఉండేది. మంచి నటుడే కాదు గట్టి నాయకుడు అవుతాడని నమ్మకం మోహన్ రెడ్డిలో ఉండేది. అంతెందుకు ద్వితీయ వివాహం వల్లనే రాజయోగం పడుతుందని మోహన్ రెడ్డి చెప్పడం వల్లనే ఎన్టీఆర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారని అప్పట్లో అందరూ అనుకునేవారు.

అందుకే మోహన్ రెడ్డి తో చివరివరకూ స్నేహ బంధం సాగింది. ఇంకా చెప్పాలంటే ఎన్టీఆర్ తుదిశ్వాస విడిచేవరకూ ఆయనతో గడిపిన వ్యక్తి మోహన్ రెడ్డి. ఒకటి రెండు రోజులు మోహన్ రెడ్డి కనిపించకపోతే ఫోన్ చేసి మరీ పిలిపించుకుని సరదాగా కబుర్లు చెప్పమనేవారట ఎన్టీఆర్. నిద్రకు ఉపక్రమించేవరకూ కబుర్లతో గడిపేవారు.

అందుకే ఆఖరి రోజు కూడా ఎన్టీఆర్ తో కల్సి భోజనం చేసిన ధన్యుడు మోహన్ రెడ్డి. అయితే కులుమనాలి లొకేషన్ కి వెళ్లే సమయంలోనే రాజకీయ ప్రస్తావన వచ్చిందట. ‘అన్నగారు మీరు రాజకీయాల్లోకి రండి మీరే సీఎం. మీకు ప్రజలు బ్రహ్మరధం పడతారు. మీ పట్టుదల, దీక్ష అలాంటివి. మీరు సీఎం, మీ కేబినెట్ లో మంత్రిని ‘అని మోహన్ రెడ్డి భవిష్యవాణి చెప్పారట. అలా ఏ నోటి వెంట మోహనరెడ్డి పలికారో గానీ అది ఏడేళ్ల తర్వాత నిజమైంది. చివరివరకూ ఎన్టీఆర్ కొలువులో కొనసాగిన మోహన్ రెడ్డి మాటంటే ఎన్టీఆర్ కి ఎంతో గురి.