MoviesUncategorized

మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గురించి కొన్ని నమ్మలేని నిజాలు

ప‌దేళ్ల కాలంలోనే 100 సినిమాల‌కు పైగా సంగీతం అందించి.. ఊహించ‌ని విధంగా అనంత లోకాల‌కు వెళ్లిపోయిన దిగ్గ‌జ సంగీత ద‌ర్శ‌కుడు చక్రి అలియాస్ చక్రధర్ జిల్లా. టాలీవుడ్ లో ఓ స‌రికొత్త సంగీత శ‌కానికి తెర‌తీసిన సంగీత ద‌ర్శ‌కుడు చ‌క్రి. తొలి సినిమా నుంచే సంచ‌ల‌న స్వ‌రాలు అందించి పేరు తెచ్చుకున్నాడు ఈయ‌న‌. పూరీ జ‌గ‌న్నాథ్ లాంటి ద‌ర్శ‌కుల సాన్నిహిత్యంతో చ‌క్రి స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అయిపోయాడు.

జూన్ 15, 1974లో వ‌రంగ‌ల్ జిల్లాలో జ‌న్మించాడు చ‌క్రి. చిన్ననాటి నుంచే సంగీతంపై మ‌క్కువ‌తోనే పెరిగాడు. అయితే ఆయ‌న్ని టీచర్‌గా చూడాలనేది తండ్రి కోరిక‌. కానీఆయనకు మాత్రం ఉద్యోగంపై ఆసక్తి ఉండేది కాదు. ఒకరి ముందు చేతులు కట్టుకొని నిలబడే కంటే మ‌న‌మే ఓ వ్యాపారం మొద‌లుపెడితే ప‌దిమందికి ప‌ని ఇవ్వొచ్చు క‌దా అనే ఆలోచ‌న చ‌క్రి కి రావడంతో రెడీమెడ్ బట్టల దుకాణం పెట్టాల‌నుకున్నాడు. ఆ త‌ర్వాత ఫ్రెండ్స్ చెప్ప‌డంతో హైద‌రాబాద్ వ‌చ్చి మ్యూజిక్ డైరెక్ట‌ర్ అవ‌కాశాల కోసం తిరిగి తిరిగి చివ‌రికి ప్రైవేట్ ఆల్బ‌మ్స్ చేసాడు.

చిరునవ్వు అని చిరంజీవిపై చేసిన ఆల్బ‌మ్ ఆయ‌న‌కు న‌చ్చి ప్ర‌త్యేకంగా అభినిందించాడు. ఆ త‌ర్వాత పెద్ద సినిమాతో అరంగేట్రం చేయాలనుకున్న చక్రి.. చాలా అవ‌కాశాలు వ‌చ్చినా కూడా వ‌ద్ద‌నుకున్నాడు. చివరకు పూరి జగన్నాథ్ బాచి చిత్రంతో సంగీత దర్శకునిగా చక్రి సినీ సంగీత ప్రస్థానం మొదలైంది. ఏ సంగీత దర్శకుని వద్ద సహాయకునిగా చేయకుండానే సంగీత దర్శకుడైన ఘనత చక్రికి సొంతం
ఆ తరువాత పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన అనేక చిత్రాలకు చక్రి సంగీత దర్శకత్వం వహించాడు. ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి, సత్యం, శివమణి, దేశముదురు, గోపి గోపిక గోదారి, నేనింతే, మస్కా, సరదాగా కాసేపు, చక్రం, ఆంధ్రావాలా, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, భగీరథ, ఢీ, రంగ ది దొంగ లాంటి ఎన్నో సినిమాల‌కు ఆయ‌న సంగీతం అందించాడు.

ఇండ‌స్ట్రీకి వంద‌ల కొద్దీ కొత్త గాయనీ, గాయకులను ప‌రిచ‌యం చేసాడు ఈయ‌న‌. సింహా సినిమాకు ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడిగా నంది అవార్డు కూడా అందుకున్నాడు. చివ‌రి రోజుల్లో శ‌రీరంపై ప‌ట్టు కోల్పోయిన చక్రి డిసెంబ‌ర్ 15, 2014 ఉద‌యం నిద్ర‌లోనే గుండెనొప్పితో క‌న్నుమూసాడు.