హీరోయిన్లను పెళ్లి చేసుకున్న క్రికెటర్లు వీళ్ళే

మనదేశంలో క్రేజీ ఫీల్డ్స్ గా చెప్పుకోవాలంటే అందులో మొదటిది సినిమా, రెండోది క్రికెట్. ఈ రెండు రంగాల్లో క్రికెట్ పై మోజు బాగా కనిపిస్తుంది. క్రికెట్ సీజన్ వస్తే చాలు అందరూ టీవీలకు అతుక్కుపోతారు. ఫోర్లు,సిక్సర్లు కొడితే కేరింతలు కొడుతూ ఉత్కంఠగా క్రికెట్ వీక్షిస్తారు. అలాగే తమ అభిమాన హీరో సినిమా విడుదలైతే చాలు కటౌట్లు,దండలు, బాణాసంచా కాల్చడం వంటి వాటితో కేరింతలు కొడతారు. ఇక అభిషేకాలు,పూజలు సరేసరి. మరి ఈ రెండు రంగాల్లో ఆరితేరినవాళ్లు ఒకటిగా జతకడితే అభిమానులకు పండగే. అవును, ఈ ఆలోచనలను నిజం చేస్తూ ఈ రెండు రంగాల సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకున్నవాళ్ళు ఉన్నారు. కొందరు పెళ్లి దాకా వెళ్లినా, కొందరు మధ్యలోనే విడిపోయారు. 

క్రికెటర్స్ కి,హీరోయిన్స్ గల బంధం ఈనాటిది కాదు. ఆనాటి నుంచి ఈనాటి వరకూ ఎన్నో ఎఫైర్స్ కనిపిస్తాయి. భారత మాజీ కెప్టెన్ మన్సూర్ ఆలీఖాన్ పటౌడీ,నటి షర్మిల  1969లో పెళ్లి చేసుకున్నారు. వీళ్ళ కొడుకే బాలీవుడ్ హీరో సైఫ్ ఆలీఖాన్. ఇక ఆనాటి బాలీవుడ్ నటి నీనా గుప్తా, విండీస్ దిగ్గజం వీర్ రిచర్డ్స్ ల ఎఫైర్ గురించి అప్పట్లో మీడియా కోడై కూసింది. ఇక వాళ్ళు పెళ్లిచేసుకోకపోయినా, వారి మధ్య బంధానికి గుర్తుగా ఓ కూతురు పుట్టింది. నాగిన్ సినిమాతో దేశాన్ని ఓ ఊపు ఊపేసిన రీనారాయ్ పాకిస్తాన్ క్రికెటర్ మొహిసిన్ ఖాన్ ని 1983లో పెళ్లాడింది. ఆతర్వాత వ్యక్తిగత కారణాలతో ఈ జంట విడాకులు తీసేసుకుంది. 

కాగా హైదరాబాదీ టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్,బాలీవుడ్ నటి సంగీతా బిజ్లీని లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు. అయితే 2010లో అభిప్రాయ భేదాలతో విడాకులు పొందారు. అలాగే నటి సాగరికను క్రికెట్ మాజీ బౌలర్ జహీర్ ఖాన్ పెళ్లాడాడు. ఇక సల్మాన్ ఖాన్ నటించిన బాడీ గార్డ్ మూవీలో కీలక పాత్ర పోషించిన హాజల్ కీచ్ ను గత ఏడాది టీమ్ ఇండియా బ్యాట్స్ మ్యాన్ యువరాజ్ సింగ్ పెళ్లిచేసుకున్నాడు. ఇక గంగూలీ ,నగ్మా అప్పట్లో లవ్ చేసుకున్నా పెళ్లి పీటల దాకా వెళ్ళలేదు. ఇక నగ్మా ఇప్పటికీ ఒంటరిగానే ఉంది. తాజాగా విరాట్ కోహ్లీ,సినీ యాక్టర్ అనుష్క పెళ్లిళ్లతో బాలీవుడ్ ,క్రికెట్ రంగంలో సందడి మరింత కనిపించింది.