Devotional

రేపు ఆగస్ట్ 15 జంధ్యాల పౌర్ణమి…జంధ్యాన్ని ఏ సమయంలో మార్చుకుంటే సకల సంపదలు,కీర్తి ప్రతిష్టలు రెట్టింపు అవుతాయి

శ్రావణ మాసంలో వచ్చే జంధ్యాల పూర్ణిమ లేదా శ్రావణ పూర్ణిమ ఎంతో పవిత్రంగా భావిస్తారు. సంవత్సరంలో వచ్చే 12 పౌర్ణమిల్లోనూ శ్రావణ మాసంలో వచ్చే ఈ పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది. సాధారణంగా జంధ్యాన్ని ధరించే ప్రతి ఒక్కరు శ్రావణ పూర్ణిమనాడు పాత జంధ్యాన్ని వదిలి కొత్త జంధ్యాన్ని ధరిస్తారు. దీనినే ‘ఉపాకర్మ’అని కూడా పిలుస్తారు. అందుకే ఈ శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని జంధ్యాల పూర్ణిమ అని చెప్పి జంధ్యాల పండుగగా జరుపుకోవటం ఆచారంగా వస్తుంది. జంధ్యాన్ని ‘యజ్ఞోపవీతం’ అని అంటారు. 

యజ్ఞోపవీతం అంటే యాగ కర్మ చేత పునీతమైన దారం అని అర్థం. యజ్ఞోపవీతధారణ చేసిన వారిని ”ద్విజులు” అని పిలుస్తారు. ద్విజులు అనగా రెండు జన్మలు కలవారని అర్ధం. తల్లి కడుపు నుండి జన్మించటం ఒక జన్మ కాగా, ఉపనయనం చేసిన అనంతరం ‘జ్ఞానాధ్యయనం’ గురువు నుంచి నేర్చుకోవడం రెండో జన్మగా చెప్పబడుతుంది.ఉపనయనం అయిన ప్రతి ఒక్కరు శ్రావణ పౌర్ణమి రోజు గాయత్రీ పూజ చేసి కొత్త యజ్ఞోపవీతాన్ని ధరించి పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించాలి. 

యజ్ఞోపవీతం అంటే పరిపక్వతకు, పరిశుద్ధతకు నిదర్శనం. యజ్ఞోపవీతం అనేది పవిత్రతకు, దైవత్వానికి సంకేతం. యజ్ఞోపవీత ధారణ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ముందుగా కొత్త జంధ్యాన్ని తీసుకుని, వేసుకునే ముందు”యజ్ఞోపవీతం, పరమం పవిత్రంప్రజా పతే: యత్‌ సహజం పురస్తాత్‌  ఆయుష్య మర్య్రం, ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ:”అనే శ్లోకాన్ని పఠించి ధరించవలెను. 

నూతన యజ్ఞోప వీతాన్ని ధరించిన అనంతరం పాత (జీర్ణ) యజ్ఞోపవీతాన్ని ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తూ విసర్జించవలెను.యజ్ఞోపవీతం, యది జీర్ణవంతంవేదాంతవేద్యం, పరబ్రహ్మమూర్తింఆయుష్య మాగ్య్రం, ప్రతి ముంచ శుభ్రంజీర్ణోపవీతం విసృజామి తేజ:||ఆ తర్వాత యథాశక్తి గాయత్రి మంత్రాన్ని జపించవలెను.

సాధారణంగా వేసుకొనే జంధ్యం మూడు పోగులతో 96 బెత్తాలుండాలి. వివాహం కాని వారికి మూడు పోగులు ఒంటి ముడి ఉన్న జంధ్యాన్ని ధరింప చేస్తారు. జంద్యంలో ఉన్న మూడు పోగులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు చిహ్నంగా చెప్తారు. వివాహం అయినా వారు తొమ్మిది పోగులు,మూడు ముడులు ఉన్న యజ్ఞోపవీతాన్ని ధరించాలి. 

యజ్ఞోపవీతానికి ఉన్న ముడిని ‘బ్రహ్మముడి’ అంటారు. ఎందుకంటే యజ్ఞోపవీతాన్ని బ్రహ్మ దేవుడు తయారుచేస్తే, సంరక్షకుడైన శ్రీమన్నారాయణుడు ముప్పిరి పెట్టగా, లయ కారకుడు ముడివేయ గా, సకల వేద వేదాంగ జ్ఞానానికి సంకేత రూపమైన సావిత్రీదేవి అభిమంత్రించారు. జంధ్యం నాభివరకే ఉండాలి. నాభి క్రిందకు ఉంటే కీర్తి క్షీణిస్తుంది. 

నాభిపైకి ఉంటే ఆయుష్షు నశిస్తుంది. జంధ్యం తొమ్మిది పోగులలో ఓంకారం, నాగదేవతలు, సోముడు, పితరులు, ప్రజాపతి, వాయువు, సూర్యుడు ఇతర దేవతలు, ఉత్తమ దేవగణాలు కొలువై ఉంటారు. మగవారికి మాత్రమే కేటాయించిన ఈ పూజ ఆచరించిన వారి ఇంటిలో సకల సంపదలు, ధన ధాన్యాదులు రెట్టింపు అయ్యి ఆనందంగా ఉంటారు. జంధ్యంను ఉదయం 6 గంటల నుండి 9 గంటల మధ్య వేసుకుంటే మంచిది.