Teachers Day

సర్వేపల్లి రాధాకృష్ణ గారి బాల్యం ఎక్కడ గడిచిందో తెలుసా?

డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ (సెప్టెంబర్ 5, 1888 – ఏప్రిల్ 17,  1975)  భారతదేశపు  మొట్ట మొదటి ఉపరాష్ట్రపతి మరియు రెండవ రాష్ట్రపతి. భారతీయ తాత్వికచింతనలో పాశ్చాత్య తత్వాన్ని ప్రవేశ పెట్టారని ప్రతీతి. రెండు పర్యాయాలు ఉపరాష్ట్రపతి పదవి చేపట్టి, తరువాత రాష్ట్రపతిగా ఒక పర్యాయం పదవిని చేపట్టి, భారతదేశపు అత్యంత క్లిష్టకాలంలో (చైనా, పాకిస్తాన్లతో యుద్ధ సమయం) ప్రధానులకు మార్గనిర్దేశం చేశారు.

సర్వేపల్లి రాధాకృష్ణన్ 5-9-1888న మద్రాసుకు ఈశాన్యంగా 64 కి.మీల దూరమున ఉన్న తిరుత్తణిలో సర్వేపల్లి వీరస్వామి, సీతమ్మ దంపతులకు జన్మించాడు. వీరాస్వామి ఒక జమీందారీలో తహసిల్దార్. వారి మాతృభాష తెలుగు. సర్వేపల్లి బాల్యము మరియు విద్యాభ్యాసము ఎక్కువగా తిరుత్తణి మరియు తిరుపతిలోనే గడిచిపోయాయి. ప్రాథమిక విద్య తిరుత్తణిలో సాగింది.  తిరుపతి, నెల్లూరు, మద్రాసు క్రిస్టియన్ కాలేజీ మున్నగుచోట్ల చదివి ఎం.ఏ పట్టా పొందాడు. బాల్యం నుండి అసాధారణమైన తెలివితేటలు కలవాడాయాన.1906లో 18 సంవత్సరాల చిరుప్రాయంలో శివకామమ్మతో వివాహము జరిగింది. వీరికి ఐదుగురు కూతుళ్ళు, ఒక కుమారుడు కలిగారు.

21 సంవత్సరాలైనా దాటని వయసులో ఆయన మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో ప్రొఫెసర్ అయ్యాడు. తత్వశాస్త్రంలో అతని ప్రతిభను విని మైసూరు విశ్వవిద్యాలయం ఉపకులపతి హెచ్.వి.నంజుండయ్య అతనిని పిలిపించి ప్రొఫెసర్ గా నియమించాడు. ఆయన ఉపన్యాసాలను ఎంతో శ్రద్ధగా వినేవారు విద్యార్థులు. కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్య పదవి చేపట్టమని, డా. అశుతోష్ ముఖర్జీ, రవీంద్రనాథ టాగూర్‌లు కోరారు. దాంతో ఆయన కలకత్తా వెళ్ళాడు. కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడుగా వున్నప్పుడు ఆయన ‘భారతీయ తత్వశాస్త్రం’ అన్న గ్రంథం వ్రాశాడు. ఆ గ్రంథం విదేశీ పండితుల ప్రశంసలందుకున్నది.

1931లో డా. సి.ఆర్.రెడ్డి గారి తర్వాత రాధాకృష్ణన్ గారు ఆంధ్రవిశ్వవిద్యాలయం వైస్ ఛాన్సిలర్‌గా పనిచేశారు. అప్పట్లో డా. రాధాకృష్ణన్‌గారి పిలుపుననుసరించి ప్రొఫెసర్ హిరేన్ ముఖర్జీ, హుమయూన్ కబీర్ వంటి మేధావులు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లుగా పనిచేశారు.1931లోనే రాధాకృష్ణన్ “లీగ్ ఆఫ్ నేషన్స్ ‘ఇంటలెక్చ్యుయల్ కో-ఆపరేషన్ కమిటి'” సభ్యులుగా ఎన్నుకోబడినారు. 1936లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ప్రాచ్యమతాల గౌరవాధ్యపకులయ్యారు. చైనా, అమెరికా దేశాల్లో పర్యటించి పెక్కు ప్రసంగాలు చేశారు.

1946లో ఏర్పడిన భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులయ్యారు. 1947 ఆగస్టు 14-15తేదీన మధ్యరాత్రి ‘స్వాతంత్ర్యోదయం’ సందర్భాన శ్రీ రాధాకృష్ణన్ చేసిన ప్రసంగం సభ్యులను ఎంతో ఉత్తేజపరిచింది.1949లో భారతదేశంలో ఉన్నత విద్యాసంస్కరణలు ప్రవేశపెట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఒక కమిటి నియమించింది. దానికి అధ్యక్షుడు డా. రాధాకృష్ణన్.డా.రాధాకృష్ణన్, ప్రధాని నెహ్రూ కోరిక మేరకు 1952-62 వరకు భారత ఉపరాష్ట్రపతిగా పనిచేశారు.