Movies

విప్రనారాయణ సినిమాలో ANR ని ఎంపిక చేసినప్పుడు పరిశ్రమలో వ్యతిరేకత వచ్చింది…ఎందుకో తెలుసా?

భరణీ వారి ‘విప్ర నారాయణ’ చిత్రంలో కథానాయకుడి పాత్ర కోసం ఏఎన్నార్‌ను ఎంపిక చేసినప్పుడు పరిశ్రమలో వ్యతిరేకత వెల్లువెత్తిందట. పరమ ఛాందసుడైన ఓ భక్తుడి పాత్రకు నాస్తికుడిగా ముద్రపడ్డ నాగేశ్వరరావు న్యాయం చెయ్యలేడంటూ కొందరు విమర్శించారు. దీన్ని ఆయన సవాల్‌గా తీసుకుని పాత్రను పండించేందుకు బాగా కసరత్తు చేశారు. అందులో భాగంగా సముద్రాల రాఘవాచార్య వద్ద కూర్చొని సంభాషణల ఉచ్చారణ సాధన చేశారట. తెల్లవారుజామున లేచి సంభాషణలు మననం చేస్తూ, ఒడుపుల్ని ఒడిసి పట్టే వారు. నడకలోనూ, హావభావాలలోనూ భక్తి రసాన్ని పలికించేందుకు నాగయ్య నటనను మార్గదర్శకంగా తీసుకుని వాహినీ వారి ‘భక్త పోతన’ చిత్రాన్ని మళ్లీ మళ్లీ వేయించుకుని చూశారట ఏఎన్నార్‌.

అలాగే ‘విప్రనారాయణ’ చిత్రీకరణ పూర్తయిన తర్వాత సంభాషణల్లో వచ్చే ‘శ్రీ’ ఉచ్చారణ తనకు సంతృప్తికరంగా లేకపోవటంతో పట్టుబట్టి డబ్బింగ్‌ చెప్పి సరి చేసుకున్నారట. అలా సవాల్‌గా తీసుకున్న పాత్రకు లభించిన ప్రశంసలు తన నటజీవిత విజయానికి దోహదం చేశాయని అక్కినేని తన అనుభవాల్లో రాసుకున్నారు. డిసెంబరు 10, 1954లో విడుదలైన ఈ చిత్రం 65ఏళ్లు పూర్తి చేసుకుంది.