Politics

రంగుల లోకం నుండి రాజకీయాల్లోకి వచ్చిన తారలు

ఒకప్పుడు తెలుగు సినిమా రంగం వేరు,రాజకీయ రంగం వేరు ఉన్నా,రానురాను సినిమా స్టార్స్ రాజకీయాల్లో భాగం అయిపోయారు. కొందరు రాజకీయ నేతలు సినిమాల్లో కూడా నటించడం పరిపాటి అయింది. నటుడు కొంగర జగ్గయ్య 1967ఎన్నికల్లో ఒంగోలు లోకసభ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. దీంతోనే ఒక నటుడు పార్లమెంట్ కి ఎన్నికవడం మొదలైంది. తెలుగు సినీ రంగాన్ని ఏలిన ఎన్టీఆర్ 57ఏళ్ల వయస్సులో రాజకీయ రంగం లోకి అడుగుపెట్టారు. తెలుగుదేశం పార్టీని నెలకొల్పి, రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటన చేసి,9నెల్లల్లోనే అధికారంలోకి వచ్చి రికార్డ్ క్రియేట్ చేసారు.

ఇక తమిళనాట ఎం జి రామచంద్రన్ అంతకుముందే రాజకీయాల్లోకి వచ్చి సీఎం అయ్యారు. అన్నా డిఎమ్ కె పార్టీని కూడా నెలకొల్పి ఎక్కువ కాలం సీఎం గా చేసారు. ఇక శివాజీ గణేశన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. రాజ్యసభ సభ్యునిగా చేసారు. ఆతరువాత ప్రత్యేక పార్టీని కూడా నెలకొల్పిన, ఎలాంటి ప్రభావం చూపలేదు. ఇక జయలలిత తెలుగు,తమిళ భాషల్లో నటించి,ఆతర్వాత అన్నా డిఎమ్ కె లో చేరి పార్టీ పగ్గాలు కూడా చేపట్టి రెండున్నర దశాబ్దాలు పాలించారు. అందాల నటి జయప్రద టీడీపీలో చేరి రాజ్యసభ కు ఎంపికైంది. తర్వాత సమాజ్ వాదీ పార్టీలో చేరి,ఉత్తరప్రదేశ్ రాంపూర్ నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికైంది. తర్వాత ఆర్ ఎల్ డి లో ,మొన్నటి ఎన్నికల్లో బిజెపి తరపున పోటీచేసి ఓడిపోయారు.

రావు గోపాలరావు టిడిపి తరపున రాజ్యసభకు వెళ్లారు. సూపర్ స్టార్ కృష్ణ ఏలూరు నుంచి,నటి జమున రాజమండ్రి నుంచి 1989లోక సభకు పోటీచేసి గెలిచారు. అయితే1991మధ్యంతర ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే కృష్ణంరాజు1989లో కాంగ్రెస్ తరపున నరసాపురం నుంచి పోటీ చేసి,ఓడిపోయినా, 1998లో కాకినాడ నుంచి ,1999లో నరసాపురం నుంచి బిజెపి తరపున పోటీచేసి గెలిచారు. కేంద్రంలో వాజపేయి మంత్రివర్గంలో రక్షణ శాఖ సహాయ మంత్రిగా చేసారు. నటుడు కైకాల సత్యనారాయణ మచిలీపట్నం నుంచి,నటి శారద తెనాలి నుంచి టీడీపీ తరపున 1996లో లోకసభకు ఎన్నికయ్యారు.

విజయ నిర్మల,నరేష్ ఎన్నికల్లో పోటీ చేసినా నెగ్గలేదు. అయితే నటుడు కోట శ్రీనివాసరావు విజయవాడ నుంచి ఎమ్మెల్యేగా బిజెపి తరపున ఎన్నికయ్యారు. అలాగే నటుడు బాబు మోహన్ టిడిపి తరపున ఎమ్మెల్యేగా ఎన్నికై చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా చేసారు. తర్వాత టి ఆర్ ఎస్ లో చేరి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు.తెలుగులో మెగాస్టార్ గా చక్రం తిప్పుతున్న సమయంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టి,సక్సెస్ కాలేదు. 18సీట్లతో నెగ్గిన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి,మన్మోహన్ సర్కార్ లో కేంద్ర మంత్రిగా చేసారు. ఇప్పుడు రాజకీయాలు వదిలేసి,సినిమాలతో మళ్ళీ బిజీ అయ్యాడు.

నందమూరి బాలయ్య సినిమాలు ఉంటూనే హిందూపూర్ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి నెగ్గారు. 2009ఎన్నికల్లో టిడిపి తరపున విస్తృత ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఆతర్వాత సినిమాలకే అంకితం అయిపోయి, రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. జయసుధ కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యే గా ఎన్నికై,తర్వాత టిడిపిలో చేరి,ఇప్పుడు వైసిపిలో ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి, గత ఎన్నికల్లో టిడిపి,బిజెపి కూటమికి మద్దతు తెల్పాడు.

ఈసారి వామపక్షాలు,బీఎస్పీ తో కల్సి ఎన్నికల్లో పోటీచేస్తే కేవలం ఒక్క సీటే వచ్చింది. రెండు చోట్ల పోటీచేసి ఓడిపోయారు. హీరోయిన్ రోజా వైస్సార్ సిపి తరపున ఎమ్మెల్యే గా ఎన్నికై, ఈసారి కూడా రెండో సారి ఎన్నికయ్యారు. ఇక ఒకప్పుడు టిడిపి నుంచి రాజ్యసభకు వెళ్లిన మోహన్ బాబు ప్రస్తుతం వైసిపిలో ఉన్నారు. విజయశాంతి టిఆర్ ఎస్ నుంచి మెదక్ లోకసభకు పోటీచేసి గెలిచారు. ఇప్పడు కాంగ్రెస్ లో ఉన్నారు.