Devotional

మరో రెండు వారాలు శ్రీవారి దర్శనాలు రద్దు.. ఏప్రిల్ 30 తర్వాతే?

కరోనా వైరస్ దెబ్బకు దేశంలోని ప్రధాన ఆలయాలకు భక్తులను అనుమతించడంలేదు. భక్తులను అనుమతించకుండా ఆలయాల్లో పూజలను ఏకంతంగా నిర్వహిస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం సైతం మార్చి 22 నుంచి భక్తుల రాకపై ఆంక్షలు విధించింది. తొలుత వారం రోజుల వరకు నిషేధిస్తున్నట్టు ప్రకటించిన టీటీడీ దీనిని ఏప్రిల్ 14 వరకు పొడిగించింది. దీంతో తిరుమలలో ఉగాది ఆస్థానం, శ్రీరామ నవమి వేడుకలు సైతం స్వామికి ఏకాంతంగానే నిర్వహించారు. ఇదిలా ఉండగా.. లాక్‌డౌన్‌ను పొడిగించడానికే కేంద్రం మొగ్గుచూపుతుందని సంకేతాలు వెలువడటంతో శ్రీవారి ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని ఈ నెలాఖరు వరకు నిషేధించాలని టీటీడీ యోచిస్తోంది.

తాజా పరిణామాలను బట్టి ఏప్రిల్ 30 వరకు భక్తులకు దర్శనం, సేవలను రద్దుచేసి, స్వామివారి కైంకర్యాలను ఏకాంతంగా కొనసాగించనున్నారు. తిరుమల కనుమదారుల్లో వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించారు. తిరుపతి, సమీప గ్రామాల్లో పేదలు, వలస కార్మికులు, యాచకులు 50వేల మందికి ఆహారం తిరుమల అన్నదాన కేంద్రంలో తయారుచేసి ప్యాకెట్ల రూపంలో అందిస్తోంది. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శుక్రవారం ప్రారంభమైన ‘యోగవాశిష్టం-శ్రీ ధన్వంతరి మహామంత్ర’ పారాయణాన్ని వేదపండితులు కొనసాగిస్తున్నారు. లోక కల్యాణార్థం, మానవాళి ఆరోగ్యం కాంక్షిస్తూ టీటీడీ ఈ క్రతువు చేపట్టింది.

గ్రహణ సమయాల్లోనే పూర్తిగా శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తారు. అయితే, శ్రీవారి ఆలయం చరిత్రలో ఇన్ని రోజులు భక్తులను దర్శనానికి అనుమతించని దాఖలాలు లేవు.