Movies

కథేమో మహేష్ కోసం .. కానీ కమెడియన్ హీరో అయ్యాడు

సినిమాల్లో ఎన్నో వింతలూ విశేషాలు ఉన్నట్టే ,సినిమాల ఛాన్స్ ల విషయంలో కూడా అనూహ్య మార్పులు వచ్చేస్తాయి. ఒకరి కోసం అనుకున్న సినిమా ఇంకొకరితో తీయాల్సి వస్తుంది. అలాగే ఒకరికోసం రాసిన కథ మరొకర్ని హీరోగా చేస్తుంది. సరిగ్గా ఇక్కడే అదే జరిగింది. ఇప్పుడు మహేష్ బాబు సూపర్ స్టార్ అవ్వొచ్చు కానీ చిన్నపుడు కూడా నటించాడు. బాల నటుడిగానే ఇండస్ట్రీకి వచ్చి 15 సినిమాలకు పైగానే నటించి తన సత్తా చాటాడు. అందులో ఎక్కువగా తండ్రి కృష్ణతోనే నటించాడు. కొన్ని సోలో హీరోగా కూడా నటించి మెప్పించాడు. అలాంటి సమయంలోనే దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి అప్పట్లో మహేష్ బాబును దృష్టిలో పెట్టుకుని ఓ కథ రాసాడు.

ఆ కథను హైదరాబాద్ నుంచి చెన్నైకి విమానంలో వెళుతోన్న సందర్భంలో సూపర్ స్టార్ కృష్ణకి కూడా చెప్పాడు. కథ బాగా నచ్చింది కానీ అప్పటికి మహేష్ బాబు చదువుకుంటున్నాడు. దాంతో చదువు పూర్తి కావడానికి సమయం పడుతుందనీ.. అప్పటి వరకూ సినిమాలు చేయడని కృష్ణ ఖరాఖండీగా చెప్పేసాడు. దాంతో ఎస్వీ కృష్ణారెడ్డి దృష్టి అలీ పడింది. అలా వచ్చిన సినిమా యమలీల. అప్పటి వరకు కమెడియన్‌గా చిన్నచిన్న వేషాలు వేసుకుంటున్న అలీని ఒక్కసారిగా రాత్రికి రాత్రే స్టార్‌గా మార్చేసింది. మదర్ సెంటిమెంట్‌కు కామెడీని జోడించి ఎస్వీ కృష్ణారెడ్డి చేసిన ఈ చిత్రం సంచలన విజయం అందుకుంది.

అప్పట్లోనే ఏడాదికి పైగా ఆడిన యమలీల లాభాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోల సినిమాలు కూడా బిత్తరపోయేలా యమలీల కలెక్షన్ల కుంభవృష్టి సృష్టించింది. వాస్తవానికి ఈ సినిమాలో అలీని హీరోగా తీసుకోవద్దని దర్శకుడు కృష్ణారెడ్డికి చాలా మంది చెప్పారట. అయితే ఆయన మాత్రం కథపై, అలీపై నమ్మకంతో సెలెక్ట్ చేసాడు. అందుకే బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత 40 సినిమాల వరకు అలీ హీరోగా నటించాడు. కానీ అందులో ఏవీ పెద్దగా విజయం సాధించలేదు. మళ్లీ ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన ఘటోత్కచుడు మాత్రం సూపర్ హిట్ అయింది.