Movies

కోపంగా విగ్గు తీసి నేల కేసి కొట్టి తిడుతూ వెళ్ళి పోయిన అక్కినేని..ఎందుకో తెలుసా ?

అక్కినేని నాగేశ్వరరావు గారు మద్రాస్ నుండి హైదరాబాద్ వచ్చి స్థిరపడిన రోజులవి. అక్కినేని తో సినిమా అంటే హైదరాబాద్ లో మాత్రమే షూటింగ్ జరుపుకోవాలి. కేవలం పాటల చిత్రీకరణ కోసం మాత్రమే అక్కినేని మద్రాస్ వచ్చేవారు. కోదండరామిరెడ్డి డైరెక్టర్ గా, అక్కినేని హీరోగా దాంపత్యం సినిమా ప్లాన్ చేశారు నిర్మాతలు. కోదండరామిరెడ్డి దర్శకుడిగా చాలా బిజీ గా ఉన్న రోజులవి. సినిమా ముహూర్తం డేట్ ఫిక్స్ చేశారు నిర్మాతలు. అయితే మద్రాస్ లో డే అండ్ నైట్ షూటింగ్ లతో గంట కూడా తీరిక లేని కోదండరామిరెడ్డి, ముహూర్తం షాట్ కు హైదరాబాద్ కు రావడం కుదరని పరిస్థితులలో, ఆయన అక్కినేని నాగేశ్వరరావు గారికి ఫోన్ చేసి.. సార్ ముహూర్తం షాట్ మద్రాస్ లో పెట్టుకుందామా అని ధైర్యం చేసి రిక్వెస్ట్ చేస్తూ అడిగేసారు. అది ఆయనకు నచ్చదని తెలిసీ.. ముహూర్తం షాట్ మద్రాస్ లో అంటే అసలు నచ్చదని తెలిసీ, సరే ఒక సారి అడిగి చూద్దాం అని.

అయితే అక్కినేని.. సరే ఆలోచించి చెబుతా.. అని ఫోన్ పెట్టేశారు. ఆ మర్నాడు అక్కినేని, కోదండరామిరెడ్డి కు ఫోన్ చేసి, మద్రాస్ స్టూడియో లలో వద్దు, ఔట్ డోర్ షూటింగ్ అయితే చూద్దాం.. అని అన్నారు.ఆ సమాధానమే కావాల్సిన కోదండరామిరెడ్డి వెంటనే, పాటతో షూటింగ్ ప్రారంభిద్దాం, వి జి పి గార్డెన్స్ గానీ లేక విజయ గార్డెన్స్ లో ముహూర్తం షాట్ పెట్టుకుందాం .. అని అనేశారు. అప్పుడు కూడా అక్కినేని.. సరే మళ్ళీ ఆలోచించి చెబుతా.. అని ఫోన్ పెట్టేశారు.

ఆ తరువాత అక్కినేని నిర్మాతలకు ఓ కే చెప్పినట్టున్నారు. మద్రాస్ లో ముహూర్తం షాట్ కు ఏర్పాట్లు పూర్తి అయాయి. అక్కినేని షూటింగ్ స్పాట్ కు మేకప్ తో రెడీ అయి వచ్చారు. పూజా కార్యక్రమాలు పూర్తి అయాక, అక్కినేని ఒకసారి పాట విందాం ప్లే చేయమన్నారు. పాట వింటున్నప్పుడు సడెన్ గా ఒకచోట అక్కినేని నాగేశ్వరరావు గారి మొహం లో రంగులు మారిపోయాయి.

అక్కడ దొర్లిన ద్వందార్థం అంత ఇబ్బందికరమైనది కాకపోయినా.. మద్రాస్ లో ముహూర్తం షాట్ విషయం లో అసలే చిరాగ్గా ఉన్న అక్కినేని కు కోపం నషాళానికి అంటింది. ఒక్కసారిగా కుర్చీలోంచి పైకి లేచి, కోపం గా .. అక్కినేని నాగేశ్వరరావు నటిస్తున్న సినిమా ఇది. నా మీద షూట్ చేస్తున్న పాటలో డబుల్ మీనింగ్ పదాలు వాడతారా.. ఏమనుకుంటున్నారు నన్ను.. జూనియర్ ఆర్టిస్ట్ లా కనబడుతున్నా నా.. ఈ సినిమా చేయను, ఈ డైరెక్టర్ తో వర్క్ చేయను.. అని అరుస్తూ .. అదే కోపం తో విగ్గు తీసి నేల కేసి కొట్టి షూటింగ్ స్పాట్ నుంచి వెళ్ళిపోయారు. సినీ ప్రారంభోత్సవం కు వచ్చిన పాత్రికేయులు, సినీ ప్రముఖులు తెల్లబోయారు. ఇక ఈ సినిమా షూటింగ్ అటకెక్కినట్లే అని అనుకుంటూ అక్కడనుంచి నిష్క్రమించారు.

హడలిపోయిన నిర్మాతలు అక్కినేని రూం కు వెళ్ళి బతిమాలినా ఆయన కోపం చల్లారలేదు. డైరెక్టర్ ను మార్చి తీరాల్సిందే.. అని అనేశారు.. తరువాత నిర్మాతలు దర్శకుడు కోదండరామిరెడ్డి వద్దకు రాగా.. కోదండరామిరెడ్డి కూడా వారితో.. ఆ పదం నచ్చకపోతే.. మార్చమని చెబితే మారుస్తాము కదా.. ఆ మాత్రం దానికి విగ్గు తీసి నేల కేసి కొట్టి వెళ్ళిపోయారు. నేను కూడా ఈ సినిమా చేయను .. అని నిర్మాతలకు చెప్పేసి వేరే సినిమా నిర్మాణం లో నిమగ్నమయ్యారు.

కొన్ని రోజులు పోయాక చేసిన తప్పు గ్రహించిన అక్కినేని హుందాగా దర్శకుడు కోదండరామిరెడ్డి వద్దకు వెళ్ళి .. సారీ.. చెప్పారు. వెంటనే కోదండరామిరెడ్డి .. మీరు నాకు సారీ చెప్పడమేమిటి సార్.. అని.. సినిమా చేద్దామా సార్ అని అడిగితే.. వెంటనే అక్కినేని .. చేద్దామయ్యా .. అని అనేయడం.. వెంటనే దాంపత్యం సినిమా షూటింగ్ మొదలవడం.. సినిమా విడుదల కావడం.. వంద రోజులు ఆడడం.. జరిగిపోయాయి.అక్కినేని గారి గొప్పతనం ఏమిటంటే.. చాలా సందర్భాలలో ఈ వివాదం గురించి ఏమీ దాయకుండా.. ఇలా జరిగింది అంటూ విషయం అందరికీ ఆయనే వివరంగా చెప్పేవారు..