వేసవిలో సినిమాలు రిలీజ్ చేస్తే భారీ నష్టాలు తప్పవా..?

summer release movies :కరోనా కష్టం మిగిల్చిన కష్టం, తెచ్చిన ఇబ్బందులు మాములుగా లేవు. ఇప్పుడిప్పుడే థియేటర్లు తెరుస్తుండడం, ఈ ఏడాది సంక్రాంతి పండుగకు విడుదలైన సినిమాలలో మెజారిటీ సినిమాలు హిట్ టాక్ తెచ్చుకోవడం ఊరటనిచ్చాయి. క్రాక్ లాంటి సినిమాలు భారీ కలెక్షన్లు తెచ్చాయి. అయితే ఈ ఏడాది సమ్మర్ మాత్రం సినిమాలకు కష్టమేనని అంటున్నారు. మాములుగా ప్రతి సంవత్సరం వేసవిలో సినిమాలు ఎక్కువే వస్తుంటాయి. కానీ ఈసారి సీన్ రివర్స్ అయ్యేలా ఉంది.

ఇప్పటికే సమ్మర్ ని దృష్టిలో ఉంచుకుని పలువురు దర్శకనిర్మాతలు రిలీజ్ డేట్లను ప్రకటించడంతో పాటు అరణ్య, రంగ్ దే, వకీల్ సాబ్, లవ్ స్టోరీ, టక్ జగదీష్, మరికొన్ని సినిమాలు సమ్మర్ లో రిలీజ్ కి రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ ఏడాది వేసవిలో రిలీజ్ చేసే సినిమాలు భారీ కలెక్షన్లను సాధించడం కష్టమేనని విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి ప్రతి ఏటా మార్చి నెల చివరివారం నాటికి పదో తరగతి, ఇంటర్ పరీక్షలు పూర్తవ్వడంతో స్టూడెంట్స్ ఎగ్జామ్ ఫీవర్ నుంచి బయటపడి, సమ్మర్ లో సినిమాలను ఎంజాయ్ చేసేవారు.

కానీ ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో కరోనా లాక్ డౌన్, కరోనా విజృంభణ వంటి కారణాల వలన క్లాస్ లు చాలా ఆలస్యమయ్యాయి. ఇంకా కొన్ని తరగతులు కూడా స్టార్ట్ కాలేదు. ఇక కొన్ని క్లాసుల ఏప్రిల్ చివరి వారం నుంచి మే నెలాఖరు వరకు పరీక్షలు జరగనున్నాయి. దీంతో ఈ సంవత్సరం సమ్మర్ లో సినిమాల ద్వారా కలెక్షన్స్ కష్టమేనని అంటున్నారు. దానికితోడు నెగిటివ్ టాక్ వస్తే మాత్రం ఆ ప్రభావం కలెక్షన్లపై పడే ఛాన్స్ ఉంది. అందుకే చాలామంది సమ్మర్ తరువాత సినిమాలు రిలీజ్ చేసే ఉద్దేశ్యంలో ఉన్నారట.