Movies

మేజర్ చంద్రకాంత్ సినిమా వెనుక ఇంత కథ జరిగిందా…అసలు నమ్మలేరు

Major Chandrakanth Movie : చలన చిత్ర రంగంలో విశ్వ విఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ విభిన్న పాత్రల ద్వారా తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇక రాజకీయాల్లో చేరి ప్రభంజనం సృష్టించారు. దాదాపు 300పైగా సినిమాలతో అలరించిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి, సీఎం అయ్యారు. రాజకీయాల్లో చేరాక 7ఏడు సంవత్సరాల గ్యాప్ లో 4సినిమాలు చేసినా అందులో బ్రహ్మర్షి విశ్వామిత్ర, సామ్రాట్ అశోక మూవీస్ దెబ్బతిన్నాయి. అయితే మేజర్ చంద్రకాంత్ సినిమా ఎన్టీఆర్ వయస్సు మీద పడ్డా ఆయనలోని నటుడిని మరోసారి బయటకు తెచ్చింది.

అన్యాయాన్ని ఎదిరించే మేజర్ చంద్రకాంత్ పాత్రలో ఆయన చేసిన నటన అభిమానుల కు పండగ చేసింది. దేశభక్తిని రగిలించిన ఈ సినిమాలో అన్నగారి పక్కన నటిస్తూ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు స్వయంగా నిర్మించిన ఈ సినిమా దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కింది. ఎన్టీఆర్ నటించిన చివరి కమర్షియల్ చిత్రంగా ఈ మూవీ మోహన్ బాబు కెరీర్ లోనే అద్భుత చిత్రంగా నిలిచింది. కీరవాణి సంగీతంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో పుణ్యభూమి నాదేశం సాంగ్ లో అల్లూరి, సుభాష్ చంద్రబోస్, ఛత్రపతి శివాజీ, వీర పాండ్య కట్ట బ్రహ్మన, గెటప్స్ లో ఎన్టీఆర్ కనపడ్డంతో ఆడియన్స్ మరీ ముఖ్యంగా ఫాన్స్ విజిల్స్ మోత మోగించారు.

నిజానికి ఈ సినిమా వెనుక పెద్ద ఆశయం దాగి ఉంది. అదేమిటంటే, ఎన్టీఆర్ భార్య బసవతారకం కాన్సర్ తో చనిపోవడంతో ఆమె పేరుతొ క్యాన్సర్ హాస్పిటల్ కట్టాలన్నది ఆయన ఆశయం. ట్రస్ట్ బిల్డింగ్ కట్టడానికి బయట చిత్రం ఒకటి చేయనున్నట్లు ఎన్టీఆర్ మీడియాలో ప్రకటించిందే తడవుగా ఆ సినిమా తన బ్యానర్ లో చేయమని మోహన్ బాబు అడగడం, ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, వెంటనే దర్శకేంద్రుడితో ఈ తీపి కబురు చెప్పి, పరుచూరి సోదరులను కథకు రెడీ చేయమని చెప్పడం, అది ఎన్టీఆర్ కి నచ్చేయడం, షూటింగ్ స్టార్ట్ చేసి, వేగంగా పూర్తిచేయడం అన్నీ జరిగిపోయాయి. ఎన్టీఆర్, మోహన్ బాబు తండ్రీ కొడుకులుగా నటించిన ఈ మూవీ అద్భుత విజయాన్ని అందుకుని తిరుపతిలో వందరోజుల వేడుక చేసుకుంది.