ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే జొన్న సూప్ ఇలా 10 నిమిషాల్లో చేసుకోని వేడివేడిగా తాగితే ఎన్నో ప్రయోజనాలు
jowar Soup Benefits : ఈ మధ్య కాలంలో మనలో చాలా మందికి ఆరోగ్యం పట్ల శ్రద్ద పెరిగి మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసు కుంటున్నారు. అలా రాగులు, జొన్నలు, సజ్జలు వంటి వాటిని తీసుకుంటున్నారు. ఇప్పుడు జొన్న పిండితో సూప్ ఎలా తయారుచేయాలో చూద్దాం. జొన్న పిండి మార్కెట్ లో దొరుకుతుంది…లేదంటే జొన్నలను తెచ్చుకొని పిండిగా తయారుచేసుకోవచ్చు.
మిక్సీ జార్ లో అర స్పూన్ జీలకర్ర, ఒక పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క వేసుకొని మెత్తని పేస్ట్ గా తయారు చేసుకోవాలి. ఒక బౌల్ లో మూడు టేబుల్ స్పూన్ల జొన్నపిండి వేసి దానిలో అర కప్పు నీటిని పోసి ఉండలు లేకుండా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి రెండు గ్లాసుల నీటిని పోసి నీరు కాస్త వేడెక్కాక రెండు స్పూన్ల క్యారెట్ తురుము వేయాలి.
ఆ తర్వాత మూడు స్పూన్ల స్వీట్ కార్న్, 2 స్పూన్ల గ్రీన్ బటాని వేసి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తర్వాత జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఐదు నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత జొన్న పిండి మిశ్రమం, ఉప్పు వేసి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగించాలి. అంతే రుచికరమైన జొన్న పిండితో తయారుచేసిన సూప్ రెడీ.
ఈ సూప్ ని ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో తీసుకోవచ్చు లేదా సాయంత్రం సమయంలో తీసుకోవచ్చు. వారంలో రెండుసార్లు తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన జీర్ణ సంబంద సమస్యలు లేకుండా చేస్తుంది. అలాగే డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది.
శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే మెగ్నీషియం, కాపర్ మరియు కాల్షియం సమృద్దిగా ఉండుట వలన ఎముకలు బలంగా,ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గించి రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా ప్రోటీన్ సమృద్దిగా ఉండుట వలన నీరసం లేకుండా శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.