Devotional

పగడం ధరిస్తే ఏ లాభాలు కలుగుతాయి పగడం ఎలా ధరించాలి ఎలా ధరిస్తే మంచి ఫలితాలు వస్తాయో వివరంగా తెలుసుకోండి

జాతక రీత్యా నవరత్నాల్లో ఎవరు ఏది ధరిస్తే మంచిదో జ్యోతిష్య నిపుణులు చెబుతారు. ఇక ఇందులో పగడం ధరించడం వలన ఎలాంటి లాభాలు ఉంటాయో ఒకసారి తెలుసుకుందాం. శాస్త్రోక్తంగా పగడం ధరిస్తే,అగ్ని నుంచి , ఆయుధాల నుంచి,కౄర శతృవుల నుంచి రక్షణ కల్గిస్తుంది. చాలాకాలం నుంచి వెంటాడుతున్న రుణబాధలు,జీవితంలో అలుముకున్న చీకట్లు తొలగిపోతాయని, క్షేమంగా ఉంటారని, అంటున్నారు. ఆకస్మిక ప్రమాదాలను, గండాలను తప్పిస్తుంది. వివాహ ఆటంకాలు తొలగిపోతాయి. కుజ దోషం వలన ఇంట్లో కలతలు, మనస్పర్థలు మాయమవుతాయి.

పగడం ధరించడం వలన జీవితంలో నైరాశ్యం, సోమరితనం దరిచేరవు. సహనం,సాహసం అబ్బుతాయి. ఆరోగ్యం, సకల సౌఖ్యాలు పగడం ధరించడం వలన లభిస్తాయి. ఉంగరం రూపంలోనే కాకుండా,పగడపు పూసలను కూడా ధరిస్తే,కుజ గ్రహ దోషాలు పోతాయి. శారీరక బాధలు,లివర్ వ్యాధులు, రక్తపోటు,చర్మవ్యాధులు కీళ్ల బాధలు,వివిధ భాగాల వాపులు అన్నీ కూడా పగడం ధరించడం వలన తగ్గుముఖం పడతాయి. మోటారు వాహనాల నష్టాలూ, పోలీసు కేసులు ఇలా అన్నీ సర్దుకుంటాయి.

పోలీసు శాఖలో పనిచేసేవారు క్షత్రియ జాతి పగడం ధరిస్తే, మంచిదని అంటున్నారు. బంగారం, వెండి,పంచలోహాలతో గానీ తయారుచేయించుకుని పగడం ధరించవచ్చు. ఏడు కేరెట్లు గల పగడం ధరించడం అన్నిరకాలుగా శ్రేష్టం అంటున్నారు. త్రికోణాకార పగడం ధరిస్తే,విశేష ఫలితాలు వస్తాయి. నక్షత్ర ఆకారపు నున్నటి పగడాలు ధరించడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు. చిన్నదైనా సరే దోష రహితంగా ఉండాలి.

కృష్ణ పక్షం చతుర్దశి మంగళవారం గానీ,కుజుడు మకర రాశిలో ధనిష్టా నక్షత్ర సంచార సమయంలో గానీ ఓ మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రెండు గంటల మధ్య దక్షిణ ముఖంగా కూర్చుని పగడాన్ని ఉంగరంలో అమర్చాలి. ఆతర్వాత నవధాన్యాల్లో ఉంచాలి,మరునాడు ఆవుపాలు,ఆవు నెయ్యి,ఆవు పంచకం,గోమయం కలిపిన దాంట్లో ఉంచాలి.

మూడవ రోజున సుగంధ ద్రవ్యాలకు తోడు ఎర్రచందనం నీళ్లతో రుద్రాభిషేకం జరిపించి,శుద్దిచేసాకే ధరిస్తే, మంచి ఫలితాలు లభిస్తాయి. ఉంగరం ధరించేముందు గురువులకు, పెద్దలకు నమస్కరించాలి. కుడిచేతి ఉంగరపు వెలికి ధరిస్తే, మంచి ఫలితాలు వస్తాయి. అదే స్త్రీలు అయితే ఎడమచేతి అనామిక వెలికి ధరిస్తే శుభప్రదమని అంటున్నారు