Kitchenvantalu

Veg Paratha : పరోటాల‌ను ఒక్క‌సారి ఇలా చేయండి.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..!

Veg Paratha Recipe : సాదారణంగా మనం వెజిటేబుల్ రైస్ లేదా వెజిటేబుల్ పలావ్ వంటి కొత్త కొత్త వంటలను ట్రై చేస్తూ ఉంటాం. గోధుమ పిండితో రోటి,చపాతీ వంటి వాటిని తరచుగా చేస్తూ ఉంటాం. అలా కాకుండా కాస్త వెరైటిగా వెజిటేబుల్ పరోటా చేస్తే చాలా బాగుంటుంది. వెజిటేబుల్ పరోటా తయారికి కావలసిన పదార్ధాలు, తయారి విధానం తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:

గోధుమపిండి – 1 కప్పు
బంగాళాదుంప – 1(ఉడికించాలి)
పచ్చి బఠాణీ – పావుకప్పు
క్యారెట్ ముక్కలు – అరకప్పు
కాలీఫ్లవర్ ముక్కలు – పావుకప్పు
సన్నగా తరిగిన పాలకూర – పావుకప్పు
కొత్తిమీర – పావుకప్పు
కారం – అరచెంచా
గరం మసాలా – అరచెంచా
వాము – అరచెంచా
అల్లం వెల్లుల్లి పేస్ట్ – అరచెంచా
ఉప్పు – తగినంత
నూనె లేక నెయ్యి – కాల్చుకోడానికి సరిపడా

తయారీ విధానం:
గోడుమపిండిలో నీటిని పోసి చపాతీపిండి మాదిరిగా కలిపి పక్కన పెట్టి అరగంట అలా వదిలేయాలి. ఉడికించిన బంగాళదుంపను తొక్క తీసి మెత్తగా చేసుకోవాలి. పచ్చి బఠాణీ, క్యారెట్ ముక్కలు,కాలీఫ్లవర్ ముక్కలను మెత్తగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్ లో ఉడికించిన కూరగాయలు,పాలకూర,కొత్తిమీర వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి.

ఒక బౌల్ లోకి తీసుకోవాలి. ఈ మిశ్రమంలో మెత్తగా చేసుకున్న బంగాళదుంప,కారం,గరం మసాలా,వాము,అల్లం వెల్లుల్లి పేస్ట్,ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. గోధుమపిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, చపాతీల మాదిరిగా ఒత్తుకోవాలి. దీని మధ్యలో పై మిశ్రమాన్ని పెట్టి, అన్ని వైపుల నుంచీ మూసివేసి, మళ్లీ ఉండ చుట్టాలి. దీన్ని మళ్లీ ఒత్తుకుని నూనె లేక నెయ్యి వేసి కాల్చుకోవాలి.