Kitchenvantalu

Beerakaya roti pachadi: బీరకాయ టమాటా రోటి పచ్చడి ఈ కొలతలతో చేసేయండి.. రుచి సూపర్ గా ఉంటుంది

Beerakaya roti pachadi:రోటి పచ్చళ్లు అంటే, రోట్లో దంచి తయారు చేసేవి. నేడు ఈ పద్ధతిని కొందరే అనుసరిస్తున్నారు. అయితే, వాటి రుచి అమోఘం. మిక్సీలో కూడా అదే రుచితో రోటి పచ్చళ్లు తయారు చేయవచ్చు.

బీరకాయ, టమాటాను కలిపి పచ్చడి చేసి ప్రయత్నించండి. ఇది అంత రుచికరంగా ఉంటుంది. మరే కూర అవసరం లేకుండా దీనితోనే భోజనం చేయవచ్చు. రోలు ఉంటే, ఆ పచ్చడి తయారీకి దాన్ని వాడటం ఉత్తమం.

బీరకాయ టమాటా రోటి పచ్చడికి కావాల్సిన పదార్థాలు:

పావు కేజీ బీరకాయలు

2 చెంచాల నూనె

పావు చెంచా పసుపు

అరచెంచా ఉప్పు

2 పెద్ద టమాటాలు

1 చింతపండు రెమ్మ

2 చెంచాల నువ్వులు

అర టీస్పూన్ మెంతులు

ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు

1 టీస్పూన్ శనగపప్పు

1 టీస్పూన్ మినప్పప్పు

1 చెంచా జీలకర్ర

10 పచ్చిమిర్చి

అరకట్ట కొత్తిమీర తరుగు

తాలింపు కోసం:

1 టీస్పూన్ శనగపప్పు

1 టీస్పూన్ మినప్పప్పు

కరివేపాకు రెమ్మ

2 ఎండుమిర్చి

పావు చెంచా ఇంగువ

బీరకాయ టమాటా రోటి పచ్చడి తయారీ విధానం:

మొదట, బీరకాయను శుభ్రంగా కడిగి, తొక్క తీసి, చిన్న ముక్కలుగా కోసుకోవాలి. టమాటాలను కూడా ముక్కలుగా కోసుకోవాలి. తర్వాత, ఒక మూకుడు పెట్టి, అందులో రెండు చెంచాల నూనె పోసి, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, మెంతులు, నువ్వులు, ఎండుమిర్చి వేసి, వాటి రంగు మారేవరకు వేగించాలి.

వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చిని కూడా వేసి మరో నిమిషం పాటు వేయించాలి. ఆ తాలింపును ఒక గిన్నెలోకి తీసి, చల్లారనివ్వాలి. తరువాత, మిగిలిన నూనెలో బీరకాయ ముక్కలు, పసుపు వేసి మూత పెట్టి ఉడికించాలి. బీరకాయ ముక్కలు సగం ఉడికినప్పుడు, టమాటాలను కూడా జోడించి, మూత పెట్టి ఉడికించాలి.

అన్నీ మెత్తగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేయాలి. రోటి పచ్చడిని రోలులో దంచితే చాలా రుచిగా ఉంటుంది. రోలు లేకపోతే మిక్సర్ జార్ ఉపయోగించాలి. రోట్లో చేస్తే, ముందు తాలింపు వేసుకొని, కొంచెం కచ్చా పచ్చాగా దంచిన బీరకాయ, టమాటా ముక్కలు, కొత్తిమీర, వెల్లుల్లి వేసుకొని దంచాలి. మిక్సర్ జార్ వాడితే, ముందు తాలింపును చల్లార్చుకొని, తర్వాత బీరకాయ, టమాటా ముక్కలు, చింతపండు, కొత్తిమీర వేసి కచ్చా పచ్చగా మిక్సీ చేయాలి.

ఈ పచ్చడిని ఇలాగే తినవచ్చు. దాని రుచిని మరింత పెంచాలంటే, తాలింపు చేయవచ్చు. తాలింపు కోసం, రెండు చెంచాల నూనెను ప్యాన్‌లో వేడి చేసి, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ వేసి వేగించాలి. ఆ తాలింపును పచ్చడిలో కలిపితే, రుచి ఇంకా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం నూనె వేసి, ఈ పచ్చడితో తింటే, కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుంది.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ