స్వీట్ షాప్ స్టైల్ బూందీ లడ్డు ఇంట్లోనే.. పర్ఫెక్ట్‌గా రావాలంటే ఇలా చేయండి!
Boondi Laddu:బూందీ లడ్డు స్వీట్ షాప్ లోలా రావాలంటే ఇలా చేయండి…వంట రాని వారు కూడా చాలా సులభంగా చేసుకోవచ్చు. పండుగలు, శుభకార్యాలు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చే స్వీట్ బూందీ లడ్డు. బయట స్వీట్ షాపుల్లో కొనే లడ్డూలు జ్యూసీగా, ఎంతో రుచిగా ఉంటాయి. అదే లడ్డును ఇంట్లో చేయడానికి చాలామంది భయపడతారు.
పాకం సరిగ్గా రాక గట్టిగా అయిపోతుందనో, లేదా బూందీ గుండ్రంగా రాదనో ఆగిపోతారు. కానీ కొన్ని సింపుల్ చిట్కాలు, పక్కా కొలతలు పాటిస్తే వంట రాని వారు కూడా మొదటిసారే పర్ఫెక్ట్ బూందీ లడ్డును సులభంగా తయారు చేయవచ్చు. నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఆ స్వీట్ షాప్ స్టైల్ జ్యూసీ లడ్డు అసలు ఎలా చేయాలో ఈ పోస్ట్‌లో వివరంగా చూద్దాం.

కావాల్సిన పదార్దాలు
శనగపి౦డి – అర కిలో
ప౦చదార – కిలో
నూనె – కిలో ( నేతి మిఠాయి కావాలనుకు౦టే ఒక కిలో నెయ్యి వాడాలి.)
జీడిపప్పు – 100 గ్రాములు
కిస్మిమిస్ – 50 గ్రాములు
యాలకులు – 10 గ్రాములు
కు౦కుమపువ్వు- చిటికెడు
నెయ్యి – అర కప్పు
తయారుచేసే విధానం
ఒక గిన్నెలో శనగపిండి తీసుకోని దానిలో నీరు పోసి గరిట జారుగా ఉండలు లేకుండా బాగా కలపాలి.
ఒక గిన్నెలో పంచదార,ఒక లీటర్ నీరు పోసి స్టౌవ్ మీద పెట్టి తీగపాకం వచ్చేవరకు కలపాలి. తీగపాకం అంటే పాకాన్ని రెండు వేళ్ళతో పట్టుకొని లాగి చూస్తే తీగ రావాలి. అరకప్పు పాలలో కు౦కుమ పువ్వు వేసి కలిపి ఈ పాకంలో వేసి దించాలి.
ఒక బాండి పొయ్యి మీద పెట్టి నెయ్యి వేసి కాగాక జీడిపప్పులు,కిస్ మిస్ లు వేసి వేగించి పక్కన పెట్టాలి. ఆ తర్వాత అదే బాండిలో నూనె పోసి కాగాక పైన తయారుచేసుకున్న శనగపిండిని కప్పుతో తీసుకోని సన్నని ర౦ధ్రాలు కలిగి లోతుగా వున్న చట్ర౦లో పొయ్యాలి.అదే కప్పుతో చట్ర౦లో పి౦డిని తిప్పితే పి౦డి సన్నగా నూనెలోకి రాలుతు౦ది.
బూ౦దీని వేగించినప్పుడు మరీ ఎరుపు రంగు రాకుండా పసుపు ర౦గులో వున్నప్పుడే తీసేయాలి. ఈ విధంగా బూ౦దీ మొత్తం దూయాలి. ఇప్పుడు బూ౦దీ,కిస్ మిస్,జీడిపప్పు,యాలకులపొడి అన్నీ కలిపి పాకంలో వేసి బాగా కలిపి కొద్దిగా చల్లారక మనకు నచ్చిన సైజులో ఉండలుగా చుట్టుకోవాలి.

