రొటీన్ చపాతీలు బోర్ కొట్టాయా? కూరగాయలతో ఇలా ‘వెజ్ పరోటా’ చేయండి..
రోజూ ఒకేలాంటి చపాతీలు, పలావ్‌లు తిని బోర్ కొట్టిందా? అయితే ఈసారి బ్రేక్‌ఫాస్ట్ లేదా డిన్నర్‌లోకి కాస్త వెరైటీగా వెజిటేబుల్ పరోటా (Veg Paratha) ట్రై చేయండి. రకరకాల కూరగాయలు వేసి చేసే ఈ పరోటా ఆరోగ్యానికి చాలా మంచిది,
పైగా రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. పిల్లలు కూరగాయలు తినడానికి మారం చేస్తుంటే, ఇలా పరోటాలో స్టఫ్ చేసి ఇస్తే లొట్టలేసుకుంటూ తింటారు. ఈ టేస్టీ అండ్ హెల్తీ వెజ్ పరోటా తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం.

కావలసిన పదార్థాలు:
గోధుమపిండి: 1 కప్పు
బంగాళాదుంప: 1 (ఉడికించినది)
పచ్చి బఠాణీ: పావు కప్పు
క్యారెట్ ముక్కలు: అర కప్పు
కాలీఫ్లవర్ ముక్కలు: పావు కప్పు
పాలకూర తరుగు: పావు కప్పు (సన్నగా తరిగినది)
కొత్తిమీర తరుగు: పావు కప్పు

కారం: అర చెంచా
గరం మసాలా: అర చెంచా
వాము: అర చెంచా
అల్లం వెల్లుల్లి పేస్ట్: అర చెంచా
ఉప్పు: రుచికి సరిపడా
నూనె లేదా నెయ్యి: కాల్చుకోవడానికి సరిపడా
తయారీ విధానం:
ముందుగా ఒక గిన్నెలో గోధుమపిండి, కొద్దిగా ఉప్పు, నీళ్లు పోసి చపాతీ పిండిలా మెత్తగా కలుపుకోవాలి. ఈ పిండి ఆరిపోకుండా మూత పెట్టి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.

పచ్చి బఠాణీ, క్యారెట్, కాలీఫ్లవర్ ముక్కలను తగినన్ని నీళ్లు పోసి మెత్తగా ఉడికించుకోవాలి. బంగాళాదుంపను కూడా విడిగా ఉడికించి, తొక్క తీసి మెత్తగా మ్యాష్ చేసి పక్కన పెట్టుకోవాలి.
ఒక మిక్సీ జార్ తీసుకుని.. అందులో ఉడికించిన పచ్చి బఠాణీ, క్యారెట్, కాలీఫ్లవర్ ముక్కలతో పాటు పాలకూర, కొత్తిమీర వేసి నీళ్లు పోయకుండా మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి.
ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్‌ను ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులో ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప, కారం, గరం మసాలా, వాము, అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు వేసి అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. పరోటా లోపల పెట్టే స్టఫింగ్ రెడీ!

ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమపిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక్కో ఉండను తీసుకుని కాస్త వెడల్పుగా ఒత్తి.. మధ్యలో మనం తయారు చేసుకున్న కూరగాయల మిశ్రమాన్ని (స్టఫింగ్) పెట్టి, అంచులు బయటకు రాకుండా మూసేయాలి. ఆ తర్వాత దాన్ని మళ్లీ పొడి పిండి చల్లుతూ జాగ్రత్తగా పరోటాలా (కాస్త మందంగా) ఒత్తుకోవాలి.
స్టవ్ మీద పెనం (Tawa) పెట్టి బాగా వేడి అయ్యాక, ఈ పరోటాను వేయాలి. రెండు వైపులా నూనె లేదా నెయ్యి రాస్తూ, మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఎర్రగా కాల్చుకుని ప్లేట్లోకి తీసుకోవాలి.
ఇవి కూడా చదవండి:
వేడివేడి వెజ్ పరోటాలను పెరుగు (రైతా) లేదా మీకు నచ్చిన ఏదైనా ఊరగాయతో తింటే రుచి అమోఘంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం.. మీ ఇంట్లో వాళ్లకు ఈ రోజే చేసి పెట్టండి!

