Movies

డాక్టర్ అయిన ప్రభాకరరెడ్డి యాక్టర్ గా మారటానికి గల కారణాలు ఏమిటో తెలుసా? నమ్మలేని నిజాలు

డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యానని చాలామంది చెప్పడం విన్నాం. కానీ అదేదో గౌరవ డాక్టరేటు మరోటో కాకుండా ఏకంగా ఎంబిబిఎస్ డాక్టర్ చదివి జాబ్ కూడా వదిలేసి యాక్టరయ్యారు డాక్టర్ ఎం. ప్రభాకర రెడ్డి. ఎన్నో చిత్రాల్లో నటించి ,మరెన్నో చిత్రాలకు కథలు అందించి, ఆ చిత్రాలకు సమర్పకుడిగా వ్యవహరించిన ప్రభాకర రెడ్డి మంచి కేరక్టర్ నటుడు. విలన్ గా, తండ్రిగా, మామగా,ఇలా ఎన్నో పాత్రల్లో ఆయన జీవించారు.
తెలంగాణా ప్రాంతంలోని సూర్యాపేటకు చెందిన డాక్టర్ ప్రభాకర రెడ్డి చాలా కష్టపడి ఎంబిబిఎస్ చదివారు. ‘చివరకు మిగిలేది ఏది’ సినిమాలో నటించిన ప్రభాకర రెడ్డికి ఆ సినిమా విడుదలకు ముందే ఎంబిబిఎస్ ఫలితాలు వచ్చి డాక్టర్ అయ్యారు.

హైదరాబాద్ లో ఓ ప్రాక్టీస్ చేస్తూనే భీష్మ,తండ్రులు కొడుకులు మూవీస్ నటించి డాక్టర్ కన్నా యాక్టర్ గా కొనసాగాలన్న నిర్ణయానికి వచ్చారు. ఛాన్స్ లు బాగా వస్తున్నందున ఎందుకు వదలాలి అంటూ సినిమాలకే పరిమితం అయ్యారు. అయితే కొంతకాలం గడిచాక పరిస్థితి మారింది. సినిమాల్లో ఛాన్స్ లు రాక, ప్రాక్టీస్ లేక డాక్టర్ ప్రభాకర రెడ్డి చాలా ఇబ్బంది పడ్డారు.

ఇక ఉర్దూ బాగా వచ్చిన డాక్టర్ ప్రభాకర రెడ్డి ఇక అప్పుడే తన బాధలను ఉర్దూ లో కవిత రూపంలో రాసుకున్నారు. ‘రేపు జీవితంలో తెల్లవారుతుందన్న ఆశ తో ముందడుగు వేసాను. కానీ దారి కఠినంగా ఉంది. గమ్యం ఎంతో దూరంలో ఉన్నా ముందుకు సాగుతూనే ఉన్నాను. అటోఇటో తేల్చుకోలేకున్నాను. నా భవిష్యత్తు అగమ్య గోచరం గా ఉంది. అంతరాత్మ వ్యతిరేకమైన పనులు చేసి పైకి రావాలన్న భావన కలగడం లేదు. మనసు మందగించింది.

గుండె మండుతోంది. మండిన గుండె నిప్పు కణంగా మారిపోయింది. ఆ కణం మసై పోయింది. బూడిద మట్టిగా మారింది. ఇప్పుడు నేను బతకలేను’అని దాని తెలుగు అర్ధం. అయితే ఈ కవిత రాసినట్లు ఆయన జీవితం విషాదంగా ముగియలేదు. ఉన్నట్టుండి అదృష్టం తలుపు తట్టింది. ఒక ఏడాది ఏకంగా పది సినిమాలు రావడంతో మళ్ళీ ఆకవితను చదివే ఛాన్స్ ఆయనకు రాలేదు.