MoviesTollywood news in telugu

వెండి తెర పై మూడు అంత కంటే ఎక్కువ పాత్రల్లో మెప్పించిన హీరోలు..

Triple Role Heroes : అప్పటి ఎన్టీఆర్, అక్కినేని, కృష్ణ మొదలు ఇప్పటి వరకూ అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని భాషల హీరోలలో చాలామంది హీరోలు, మూడేసి పాత్రలు వేసి మెప్పించారు. కొత్త హీరోలు సైతం ఇలా మూడు పాత్రల్లో మెప్పిస్తున్నారు. కొందరు హీరోయిన్స్ కూడా మూడు పాత్రల్లో అదరగొట్టారు. నటరత్న ఎన్‌టి‌ఆర్ విషయానికి వస్తే, కులగౌరవం సినిమాలో తాత, తండ్రి, మనవడిగా నటించి మెప్పించారు.

ఇక దానవీరశూరకర్ణల శ్రీకృష్ణుడిగా, దుర్యోదనుడిగా, కర్ణుడిగా మూడు పాత్రల్లో అదరగొట్టేసారు. శ్రీకృష్ణ సత్య, శ్రీమద్విరాట పర్వం, అలాగే మేజర్ చంద్రకాంత్, అడవిరాముడు లాంటి సినిమాల్లో కూడా ఒకే పాటలో మూడు అంతకన్నా ఎక్కువ పాత్రలే చేసారు. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు 1969లో నవరాత్రి సినిమాలో ఏకంగా 9 పాత్రలు చేసి అబ్బురపరిచారు.

కాగా తమిళంలో కూడా నవరాత్రి టైటిల్ తోనే రీమేక్ చేసారు. శివాజీ గణేషన్ తొమ్మిది పాత్రల్లో నటించారు. అలాగే నవరాత్రి’ సినిమాను హిందీలో సంజీవ్ కుమార్ హీరోగా నయా దిన్ నయి రాత్’’ అనే రీమేక్‌ చేసారు. సంజీవ్ తొమ్మిది పాత్రల్లో మెప్పించారు. ఇక ఎన్టీఆర్ తర్వాత మూడు పాత్రల్లో ఎక్కువ సినిమాల్లో నటించి, మెప్పించిన హీరో నట శేఖర్ కృష్ణ అనే చెప్పాలి.

కుమార్ రాజా, పగపట్టిన సింహం, రక్త సంబంధం, బంగారు కాపురం, బొబ్బిలిదొర వంటి దాదాపు 7 సినిమాల్లో మూడు పాత్రల్లో మెప్పించారు. శోభన్ బాబు హీరోగా ముగ్గురు మొనగాళ్లు మూవీ తెరకెక్కగా, ఇందులో మూడు పాత్రల్లో మెప్పించారు. ఇదే మూవీ తమిళంలో రజినీకాంత్ హీరోగా ‘మూండ్రు ముగమ్’ పేరిట రీమేక్ చేసారు.

ఆ తర్వాత ఇదే సినిమా హిందీలో ‘జాన్ జానీ జనార్ధన్’ రీమేక్‌లో కూడా రజినీకాంత్ మరోసారి 3 పాత్రల్లో మెప్పించగా, మళ్ళీ తెలుగులో ‘ముగ్గురు మొనగాళ్లు’గా డబ్ చేయడం విశేషం. మహాన్ మూవీలో తండ్రి ఇద్దరు కొడుకులుగా అమితాబ్ బచ్చన్ త్రిపాత్రాభినయం చేసారు. మెగాస్టార్ చిరంజీవి తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన మూవీ ముగ్గురు మొనగాళ్లు.

దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ మూవీ అనుకున్నమేరకు విజయం సాధించలేదు. నాగార్జున సినిమాల్లో మూడు పాత్రలు చేయకపోయినా.. బిగ్‌బాస్ ప్రోమోలో తాత, తండ్రి, మనవడిగా 3 విభిన్న పాత్రలలో కనిపించి అలరించాడు . ‘విచిత్ర సోదరులు’ సినిమాలో మూడు పాత్రల్లో మెప్పించిన కమల్ హాసన్… మైఖేల్ మదన కామ రాజు చిత్రంలో 4పాత్రలతో అలరించారు. ఇక దశావతారం సినిమాలో ఏకంగా 10 పాత్రలు చేసి అదరగొట్టాడు.

అధినాయకుడు మూవీలో తాత, తండ్రి, మనవడు… ఇలా 3 పాత్రల్లో బాలకృష్ణ నటించాడు. కన్నడ కంఠీరవ దివంగత రాజ్ కుమార్, అలాగే కన్నడ ఎవర్‌ గ్రీన్ మాస్ హీరో దివంగత విష్ణువర్ధన్ కూడా పలు సినిమాల్లో త్రిపాత్రాభినయంతో మెప్పించారు. ఇంగ్లీష్ బాబు దేశీ మెన్ మూవీలో తండ్రి కొడుకులుగా 3 పాత్రల్లో షారుఖ్ ఖాన్ మెప్పించాడు. మిలాప్ సినిమాలో 3 కంటే ఎక్కువ పాత్రల్లో శతృఘ్న సిన్హా నటించాడు.

జియో షాన్ సే మూవీలో బ్రహ్మా, విష్ణు,మహేశ్వర్‌గా 3పాత్రల్లో ధర్మేంద్ర నటించాడు. హద్ కర్ దీ ఆప్నే మూవీలో మూడు కంటే ఎక్కువ పాత్రల్లో గోవిందా మెప్పించాడు. విభిన్న పాత్రలతో సినిమాలు చేసే తమిళ్ హీరో విక్రమ్ తన తదుపరి చిత్రంలో ఏకంగా 25 పాత్రల్లో చేస్తున్నాడు. మరో తమిళ స్టార్ హీరో సూర్య 24 మూవీలో 3 విభిన్న పాత్రల్లో మెప్పించగా, తెలుగులో అదిరింది పేరుతో వచ్చిన మెర్సల్ మూవీలో కూడా మూడు పాత్రలు చేసాడు.

అలాగే వాయలారు సినిమాలో తండ్రి కొడుకులుగా త్రిపాత్రాభినయంతో అజిత్ మెప్పించి, సూపర్ హిట్‌ అందుకున్నాడు. అంబనవన్ అసరధావన్ అధంగధావన్ మూవీలో శింబు 3 పాత్రల్లో మెప్పించాడు. జూనియర్ ఎన్టీఆర్ ‘జై లవకుశ’ మూవీలో మూడు పాత్రల్లో నట విశ్వరూపం ప్రదర్శించి బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌ అందుకున్నాడు.

కాగా సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాటలో తండ్రి కొడుకులుగా త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు టాక్. అయితే అధికారికంగా తెలియాల్సి ఉంది. వాట్స్ యువర్ రాశీ సినిమాలో ఏకంగా 12 పాత్రల్లో ప్రియాంక చోప్రా మెప్పించింది. హమ్ షకల్స్ మూవీలో సైఫ్ అలీ ఖాన్, రితేష్ దేశ్‌ముఖ్,రామ్ కపూర్‌లు మూడేసి పాత్రల్లో నటించారు. హీరో సంపూర్ణేష్ బాబు కొబ్బరిమట్ట’మూవీలో పాపా రాయుడు, పెదరాయుడు, ఆండ్రాయుడు ఇలా మూడు పాత్రల్లో నటించి మెప్పించాడు.