చిరంజీవి కెరీర్ లో ఖైదీ టర్నింగ్ పాయింట్ ఎలా అయిందో తెలుసా ?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎందరో నటీనటులు,సాంకేతిక నిపుణులు,వివిధ విభాగాల నిపుణులు,థియేటర్లు,పంపిణీదారులు ఇలా చాలామంది ఆధారపడ్డారు. అయితే ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానం మాత్రం ఒక్కరికే ఉంటుంది. ఎన్టీఆర్ సినీ రంగంలో రారాజుగా వెలుగొంది, రాజకీయాల్లో చేరి ప్రభంజనం సృష్టించారు. 1983ఎన్టీఆర్ ని సీఎం చేస్తే,అదే ఏడాది సినీ రంగంలో నెంబర్ వన్ స్థానాన్ని భర్తీ చేసేవిధంగా ఓ నటుడికి టర్నింగ్ పాయింట్ అయింది.

అది ఎవరో కాదు, ఖైదీ మూవీలో నటించిన చిరంజీవి. అప్పటివరకూ విలన్ పాత్రలతో,ఆతర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా,అనంతరం హీరోగా మారాక బ్రేక్ కోసం చూస్తున్న సమయం ఖైదీ మూవీతో ఆసన్నమైంది. ఆ బ్రేక్ ఫలితంగా చిరంజీవి మెగాస్టార్ అయ్యాడు. ఖైదీ తర్వాత డైరెక్టర్ ఏ. కోదండ రామిరెడ్డి ,చిరు కాంబినేషన్ లో ఏకంగా 15సినిమాలు వచ్చాయి. అన్నీ సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. ఖైదీ ముందు నాలుగు సినిమాలు వీరి కాంబినేషన్ లో వచ్చినా బ్రేక్ రాలేదు. అందుకే ఖైదీ తర్వాత ఇద్దరి కాంబినేషన్ అదిరిపోయేలా సాగింది.

ఖైదీ సినిమా స్టోరీని,డైలాగ్స్ తో సహా కేవలం 4రోజుల్లోనే పరుచూరి సోదరులు రాసారు. 1983జూన్ 16న మద్రాసు ప్రసాద్ స్టూడియోలో ఖైదీ మూవీ స్టార్ట్ అయింది. సూపర్ స్టార్ కృష్ణ క్లాప్ కొట్టారు. అదే ఏడాది అక్టోబర్ 23న సినిమా విడుదలై ప్రభంజనం సృష్టించింది. రగులుతోంది మొగలిపొద,గోరింట పూసింది, వంటి పాటలన్నీ ఎవర్ గ్రీన్ హిట్స్ గా నిలిచాయి.

ఫైట్స్ అయితే ఇక కొత్తదనానికి నాంది పలికాయి. పోలీస్ స్టేషన్ ఫైట్ ఇప్పటికీ ఇండస్ట్రీలో హైలెట్ గా ఉండిపోయింది. ప్రేమ,పగ, సెంటిమెంట్,కామెడీ,సంగీతం మేళవించి పండించిన ఈ సినిమా అక్షరాలా 15లక్షల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా 36కేంద్రాల్లో విడుదలై 20కేంద్రాల్లో 100రోజులు ఆడింది. తొలివారం 34లక్షల గ్రాస్ వసూలుచేసింది. 50రోజులకు కోటి 37లక్షలు, వంద రోజులకు 2కోట్ల షేర్ వసూలు చేసింది.నిజంగా ఇది ప్రభంజనమే కాదు,సంచలన విజయం కూడా.