Kitchenvantalu

Tomato Bath:ట‌మాటా బాత్ ఉప్మా.. ఒక్క‌సారి రుచి చూశారంటే.. మొత్తం తినేస్తారు..

Tomato Bath Upma Recipe: ప్రతి రోజు ఒకే రకంగా ఉప్మా చేసుకుంటే తినటానికి చాలా కష్టంగా ఉంటుంది. అయితే సహజంగా కాకుండా వెరైటీగా మసాలాతో టమాటో బాత్ చేసుకుంటే చాలా బాగుంటుంది. టమోటా బాత్ ని ఎక్కువగా ఆంధ్ర పెళ్లిళ్లలో టిఫిన్ గా పెడతారు. బొంబాయి రవ్వలో టమాట ముక్కలు వేసి ఈ ఉప్మా తయారు చేస్తారు. ఈ ఉప్మాను కారప్పొడి, శనగపప్పు చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది.

కావాల్సిన పదార్థాలు
ఒక కప్పు బొంబాయి రవ్వ, రెండు టమాటాలు, అరకప్పు ఉల్లిపాయ తరుగు, పావు కప్పు క్యారెట్ తరుగు, పావు కప్పు కాజా బటాని, ఒక స్పూన్ అల్లం తరుగు, ఒక పచ్చిమిర్చి, ఒక రెబ్బ కరివేపాకు, రెండు స్పూన్ల కొత్తిమీర తరుగు, ఒక స్పూన్ ఆవాలు,ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినప్పప్పు, ఒక స్పూన్ జీలకర్ర, అర స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, రెండు స్పూన్ల నూనె, పావు కప్పు నెయ్యి, మూడు కప్పుల నీళ్లు,పిడికెడు జీడిపప్పు

తయారీ విధానం
పొయ్యి మీద పాన్ పెట్టి బొంబాయి రవ్వ ను పోసి తక్కువ మంటలో మంచి వాసన వచ్చేవరకు వేగించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే పాన్ లో ఒక స్పూన్ నెయ్యి, రెండు స్పూన్ల నూనె వేసి వేడి చేసి అందులో జీడిపప్పు వేసి ఎర్రగా వేగించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే నూనెలో సెనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసి కొంచెం వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి.

ఆ తర్వాత అల్లం తరుగు, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఉల్లిపాయ మెత్తబడే వరకు వేగించాలి. ఆ తర్వాత టమాటా ముక్కలు వేసి రెండు నిమిషాలు వేగాక బటాని, క్యారెట్ తరుగు, పసుపు, కరివేపాకు, ఉప్పు వేసి ఉడికించాలి. ఇప్పుడు నీళ్లు పోసి నీళ్లు బాగా మరిగాక రవ్వ వేసి బాగా కలిపి మూత పెట్టి మూడు నిమిషాలు మగ్గించాలి. ఆ తర్వాత కొత్తిమీర, జీడిపప్పు, రెండు స్పూన్ల నెయ్యి వేసి బాగా కలపాలి. అంతే ఎంతో రుచిగా ఉండే Tomato Bath Upma రెడీ.