Business

BOOK MY SHOW సక్సెస్ వెనక ఎంత కష్టం దాగి ఉందో తెలుసా?

ఏదైనా చేస్తే కదా అందులో ఓడామా , గెలిచామా అని తెలిసేది. ఏదీ చేయకుండా ఏమవుతుందోనని భయపడేవాళ్లు ఎక్కువ. కానీ ఓడిపోవడం అంటే ప్రయత్నించకపోవడమేనని నమ్మి అదృష్టం కన్నా, శ్రమను నమ్ముకోవడంలోనే గెలుపు ఉంటుందని నిరూపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో 39సంవత్సరాల ఆశీష్ హేమరాజ్ ఒకరు. ఒకప్పుడు సినిమా చూడలాంటే లైన్ లో నుంచుని టికెట్స్ తీసుకోవాలి. కొత్త సినిమా అయితే నాలుగైదు గంటల ముందు వచ్చి బుకింగ్ దగ్గర పడిగాపులు కాయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు అంతా ఆన్ లైన్ లోనే అయిపోతుంది.
సినిమా రిలీజ్ డేట్ ఇచ్చాక వారం ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్ కూడా చేసుకునే వెసులుబాటు ఈ ఆన్ లైన్ సిస్టం ద్వారా వచ్చేసింది.

అయితే ఇంతటి సౌలభ్యం గల ఈ సిస్టం ని అందుబాటులోకి తెచ్చిన వ్యక్తి ఆశీష్ హేమరాజ్. ఫారిన్ నుంచి వచ్చాక ఉద్యోగానికి రాజీనామా చేసి, 15ఏళ్లపాటు శ్రమించి ఎన్నో ఇబ్బందులు,ఒడిడుకులు ఎదుర్కొని ఆన్ లైన్ లో టికెట్స్ బుకింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. 1999లో మూవీ ఈవెంట్ టికెటింగ్ పోర్టల్ గా ఆన్ లైన్ టికెటింగ్ సర్వీస్ ప్రారంభించారు. దేశంలోనే అగ్రస్థానంలో నిల్చిన ఈ ఆన్ లైన్ సిస్టం వ్యాపారం 25వేలతో ప్రారంభించి,కోట్లకు చేర్చారు.

ఆశీష్ హేమరాజ్ ముంబయిలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ మార్కెటింగ్ లో పట్టా అందుకున్నారు. జె వాల్టర్ థామస్ అడ్వర్టైజింగ్ లో చేరారు. టూర్స్ అంటే చాలా ఇష్టపడే ఆశీష్ ఈ ప్రయాణాల వలన ఎంతో నేర్చుకోవచ్చని అంటారు. క్రియేటివిటీకి ప్రయాణాలు దోహదం చేస్తాయని ఆయన విషయంలో రుజువైంది. ఒకసారి దక్షిణాఫ్రికాలో ఉండగా రబ్బీ ఆటకు సంబంధించిన టికెట్స్ అమ్మే కార్యక్రమం రేడియోలో వస్తుంటే విన్నాడు.

అది అయ్యాక ఓ చెట్టు కింద నిల్చుని,ఆలోచన చేస్తుంటే బుక్ మై షో అనే ఒక ఐడియా వచ్చింది. భ్యవిష్యత్తు ఇంటర్ నెట్ దేనని ఊహించిన ఆశీష్ బుక్ మై షో అభివృద్ధి చేసారు. ఇక ఇండియా వచ్చాక ఉద్యోగం వదిలేసి,బుక్ మై షో ప్రారంభించి ఎన్నో ఆటుపోట్లు తట్టుకుని విజయాన్ని నమోదుచేసుకున్నారు.