రిస్క్ లేకుండా స్థిరమైన ఆదాయం? ఈ బోరింగ్ బిజినెస్ ఐడియాలు తెలుసుకోండి
Business Ideas :బిజినెస్ అనగానే కోట్లు పెట్టుబడి పెట్టాలి, ఏదో కొత్త టెక్నాలజీ కనిపెట్టాలి, లేదా స్టార్టప్ పెట్టాలి అనుకుంటాం. ప్రస్తుతం చాలామంది యూట్యూబ్, డిజిటల్ కంటెంట్ క్రియేషన్ అంటూ క్లిష్టమైన రంగాల్లోకి దిగుతున్నారు. కానీ ఎలాంటి టెన్షన్ లేకుండా, తక్కువ పెట్టుబడితో ఒక ఐటీ ఉద్యోగి స్థాయిలో సంపాదించే మార్గాలు ఉన్నాయని మీకు తెలుసా? అవే ‘బోరింగ్ బిజినెస్‌లు (Boring Businesses)’.
డిజిటల్ ప్రపంచంలో నిరంతరం వచ్చే అప్‌డేట్లు, అల్గారిథమ్ మార్పుల వల్ల 80% మందికి స్థిరమైన విజయం దొరకడం లేదు. కానీ, ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా లక్షలు సంపాదించి పెట్టే ఈ సింపుల్ బిజినెస్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అసలు ఏమిటీ బోరింగ్ బిజినెస్?
ఒక తెలుగు సినిమాలో డైలాగ్ ఉంది.. “ఎప్పుడు వచ్చామన్నది కాదు… బుల్లెట్ దిగిందా లేదా..!” అని. నేటి బిజినెస్ ప్రపంచానికి ఈ డైలాగ్ పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. “ఏం బిజినెస్ చేస్తున్నామన్నది కాదు… మంచి లాభాలు వస్తున్నాయా లేవా” అన్నదే ముఖ్యం.
రోజూ ఒకేలాంటి పనులు జరిగే, పెద్దగా కొత్తదనం లేదా క్రియేటివిటీ అవసరం లేని సాధారణ వ్యాపారాలనే ‘బోరింగ్ బిజినెస్’ అంటారు. చూసేవాళ్లకు ఇందులో గ్లామర్ కనిపించకపోవచ్చు కానీ, ఇవి సమాజానికి రోజూ అవసరమైన సేవలు. కాబట్టి కస్టమర్లు ఎప్పుడూ ఉంటారు, ఆదాయం నిలకడగా వస్తుంది.
లో రిస్క్, హై ప్రాఫిట్ ఇచ్చే టాప్ బిజినెస్ ఐడియాలు ఇవే:
పెద్ద పెద్ద చదువులతో పనిలేకుండా, శ్రద్ధగా చేసుకుంటే అద్భుతమైన లాభాలు తెచ్చిపెట్టే కొన్ని సింపుల్ ఐడియాలు ఇక్కడ ఉన్నాయి:
లాండ్రీ సర్వీస్: నగరాల్లో ఇప్పుడు ఇది అత్యవసరం. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలకు వెళ్లే ఈ రోజుల్లో బట్టలు ఉతకడం, ఇస్త్రీ చేయడం కోసం లాండ్రీల పైన ఆధారపడేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది. చిన్న పెట్టుబడితో దీన్ని మొదలుపెట్టొచ్చు.
ఎవర్ గ్రీన్ టీ స్టాల్స్: రోడ్డు పక్కన లేదా రద్దీగా ఉండే సెంటర్లలో ఒక మంచి టీ/స్నాక్స్ స్టాల్ పెడితే చాలు. వీటికి ఎప్పుడూ కస్టమర్లు ఉంటారు, ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతరం ఆదాయం వస్తూనే ఉంటుంది.
కార్ వాషింగ్ & పార్కింగ్: ప్రపంచంలో కార్లు కడిగేందుకు లక్షలు తీసుకునే ‘పాల్ డాల్టన్’ లాంటి వాళ్లే నేటి యువతకు ఆదర్శం. పనిలో నైపుణ్యం ఉంటే కార్ వాషింగ్ బిజినెస్ ద్వారా భారీగా సంపాదించవచ్చు. అలాగే ఖాళీ స్థలం ఉంటే పార్కింగ్ సేవలు అందించడం కూడా మంచి ఐడియా.
ప్యాకర్స్ & మూవర్స్: ఉద్యోగాలు, బదిలీల కారణంగా నగరాల్లో ఇళ్ల మార్పిడి చాలా సాధారణం. ప్యాకర్స్ అండ్ మూవర్స్ అలాగే వస్తువులు దాచుకునే వేర్‌హౌస్ సేవలకు ఇప్పుడు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.
ఏటీఎం (ATM) అద్దె: మీకు మంచి కమర్షియల్ లొకేషన్‌లో చిన్న స్థలం లేదా షాపు ఉంటే, దాన్ని బ్యాంకుల ఏటీఎం మెషీన్లకు అద్దెకు ఇవ్వడం ద్వారా ప్రతినెలా ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ పొందవచ్చు.
ముగింపు
బిజినెస్ అనేది పక్కవాళ్లకి గొప్పలు చెప్పుకోవడం కోసం కాదు, మనకు స్థిరమైన ఆదాయం ఇవ్వడం కోసం ఉండాలి. సింపుల్‌గా ఉన్నా సరే, తక్కువ ఒత్తిడితో, ప్రశాంతమైన జీవితం కోరుకునేవారికి ఈ ‘బోరింగ్ బిజినెస్’ మోడల్స్ బెస్ట్ ఆప్షన్.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

