వ్యాపారం చేయాలనుకుంటున్నారా? కేంద్ర ప్రభుత్వ సాయంతో జనరిక్ మెడికల్ షాప్.. పూర్తి వివరాలు మీకోసం!
వ్యాపారం చేయాలనుకుంటున్నారా? కేంద్ర ప్రభుత్వ సాయంతో జనరిక్ మెడికల్ షాప్.. పూర్తి వివరాలు మీకోసం.. రోజురోజుకూ వైద్య ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఆసుపత్రి బిల్లుల కంటే మందుల బిల్లులు చూస్తేనే సామాన్యుల జేబులు ఖాళీ అవుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో తక్కువ ధరకే నాణ్యమైన మందులు అందించే ‘జనరిక్ మెడికల్ షాప్స్’ (ప్రధాన్ మంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రాలు – PMBJK) ప్రజలకు వరంగా మారాయి. మీరూ సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నారా? తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు తెచ్చిపెట్టే ‘జన్ ఔషధి కేంద్రం’ గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
నాణ్యతకు నాణ్యత.. సగానికి సగం ఆదా!
బ్రాండెడ్ మందులతో సమానంగా పనిచేసే జనరిక్ మందులను తక్కువ ధరకు అందించడానికి కేంద్ర ప్రభుత్వం 2008లో ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. మార్కెట్లో దొరికే బ్రాండెడ్ మందుల కంటే ఇవి 50% నుంచి 80% వరకు తక్కువ ధరకు లభిస్తాయి. WHO-GMP సర్టిఫైడ్ సంస్థల నుంచే వీటిని కొనుగోలు చేస్తారు కాబట్టి నాణ్యతలో ఎలాంటి రాజీ ఉండదు.
ఉదాహరణకు ధరల్లో తేడా చూస్తే:
అజిత్రోమైసిన్ (250 mg): 6 టాబ్లెట్స్ బ్రాండెడ్ ధర రూ.75 వరకు ఉంటే.. జన్ ఔషధి కేంద్రంలో కేవలం రూ.42 మాత్రమే.
పారాసిటమాల్ (650 mg): 15 టాబ్లెట్స్ బ్రాండెడ్ ధర రూ.35 వరకు ఉంటే.. జనరిక్ షాప్‌లో కేవలం రూ.14 మాత్రమే.
మహిళల కోసం ‘సువిధ’ శానిటరీ న్యాప్‌కిన్స్ ఒక్కొక్కటి రూ.1 కే లభిస్తాయి.
పెట్టుబడి ఎంత కావాలి?
ఒక జన్ ఔషధి కేంద్రాన్ని ప్రారంభించడానికి సుమారు రూ. 5 లక్షల వరకు పెట్టుబడి అవసరం అవుతుంది.
ఇందులో 120 చదరపు అడుగుల స్థలం (సొంతం లేదా అద్దె).
ఫర్నిచర్, కంప్యూటర్, ఇంటర్నెట్, POS సిస్టమ్.
ప్రాథమిక మెడిసిన్ స్టాక్ (2,047 రకాల మందులు, 300 సర్జికల్ వస్తువులు అందుబాటులో ఉన్నాయి).
లాభాలు ఎలా ఉంటాయి?
జనరిక్ మెడికల్ షాప్ ఏర్పాటు చేయడం కేవలం సేవే కాదు.. మంచి లాభసాటి వ్యాపారం కూడా!
నెలవారీ ఆదాయం: సగటున ఒక కేంద్రంలో నెలకు రూ. 1.5 లక్షల వ్యాపారం జరిగితే, 20% ఆపరేటింగ్ మార్జిన్ (రూ.30,000) మరియు ప్రభుత్వ ప్రోత్సాహకాలు కలుపుకుని సులభంగా నెలకు రూ. 40,000 వరకు లాభం పొందవచ్చు. 12 నుంచి 15 నెలల్లోనే మీరు పెట్టిన పెట్టుబడి వెనక్కి వస్తుంది.
ప్రభుత్వ ప్రోత్సాహకాలు: షాప్ తెరిచిన వ్యాపారులకు నెలవారీగా రూ.20,000 వరకు ప్రోత్సాహకాలు లభిస్తాయి.
ప్రత్యేక ఆఫర్: మహిళలు, ఎస్సీ/ఎస్టీ వర్గాలు, దివ్యాంగులు, మాజీ సైనికులకు ప్రోత్సాహకంగా కేంద్ర ప్రభుత్వం అదనంగా రూ. 2 లక్షల ప్రత్యేక సాయం అందిస్తుంది. దీనివల్ల పెట్టుబడి భారం బాగా తగ్గుతుంది.
ఎవరు అర్హులు? ఎలా అప్లై చేయాలి?
వ్యాపారం ప్రారంభించే వ్యక్తికి B.Pharma లేదా D.Pharma డిగ్రీ ఉండాలి.ఒకవేళ మీకు ఆ డిగ్రీ లేకపోయినా, అర్హత కలిగిన ఫార్మసిస్ట్‌ను ఉద్యోగిగా నియమించుకుని కూడా ఈ షాప్ తెరవొచ్చు.వ్యక్తులతో పాటు స్వచ్ఛంద సంస్థలు (NGOs), ట్రస్టులు కూడా వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు.సాధారణ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ. 5,000 ఉంటుంది. ప్రత్యేక కేటగిరీ వారికి ఫీజు మినహాయింపు ఉంటుంది.
ఈ వ్యాపారం ద్వారా స్థిరమైన ఆదాయం పొందడమే కాకుండా, పేద, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే మందులు అందిస్తూ సమాజానికి మేలు చేసిన వారవుతారు. ఇంకెందుకు ఆలస్యం? మీకు దగ్గర్లో ఉన్న కేంద్రాలను, జనరిక్ మందుల వివరాలను తెలుసుకోవడానికి ‘Janaushadhi Sugam’ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

