బరువు తగ్గాలనుకునే వారికి, షుగర్ ఉన్నవారికి బెస్ట్ టిఫిన్.. కరకరలాడే హై-ప్రోటీన్ దోశ!
Protein Dosa Recipe: మన దక్షిణాది వారి ఇళ్లలో ఉదయం బ్రేక్ఫాస్ట్ అనగానే ముందుగా గుర్తొచ్చేది దోశ. అయితే సాధారణంగా మనం బియ్యం, మినపప్పుతో చేసుకునే దోశల్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల తిన్న కాసేపటికే మళ్లీ ఆకలి వేయడం, ఒంట్లో నీరసంగా అనిపించడం జరుగుతుంది.
అలా కాకుండా రోజంతా శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తూ, ఉల్లాసంగా ఉంచేలా ‘హై-ప్రోటీన్ దోశ’ (Protein Dosa) ను మీ బ్రేక్ఫాస్ట్లో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
వివిధ రకాల పప్పులు, పోషకాలతో తయారుచేసే ఈ దోశ రుచిలో అద్భుతంగా ఉండటమే కాకుండా.. బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిస్ ఉన్నవారికి మరియు ఎదుగుతున్న పిల్లలకు ఒక పర్ఫెక్ట్ హెల్తీ టిఫిన్. మరి కరకరలాడుతూ, ఒంటికి కొండంత బలాన్నిచ్చే ఈ ప్రోటీన్ దోశను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం!
ఎంత తిన్నాం అన్నది కాదు..ఎన్ని పోషకాలు తీసుకున్నాం ,ఎంత ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకున్నాం అన్నది ముఖ్యం. మల్టీ గ్రేన్స్ తో, మసాల పొడితో ప్రోటీన్ దోశ ఎలా చేసుకోవాలో చూసేయండి.
కావాల్సిన పదార్ధాలు
అడై కోసం..
ముడి పెసలు – ¼ కప్పు
అలసందలు – ¼ కప్పు
మినపప్పు – ¼ కప్పు
ముడి శనగలు – ¼ కప్పు
బియ్యం – 1 కప్పు
పచ్చి కొబ్బరి – 1/.4 కప్పు
పచ్చిమిర్చి – 3
ఉప్పు – తగినంత
జీలకర్ర – 1 టేబుల్ స్పూన్
వెల్లుల్లి – 10
నూనె – దోశ కాల్చడానికి
అడై పొడి కోసం..
పచ్చి శనగపప్పు – 2 టేబుల్ స్పూన్
మినపప్పు -1 టేబుల్ స్పూన్
నువ్వులు – 2 టేబుల్ స్పూన్
ఎండుమిర్చి – 10
కరివేపాకు – 2 రెమ్మలు
జీలకర్ర – 1 టేబుల్ స్పూన్
వెల్లుల్లి – 5-6 రెబ్బలు
ఉప్పు – తగినంత
తయారీ విధానం
1.ఆడై కోసం ఉంచిన పప్పులన్ని రాత్రంత నానబెట్టుకోవాలి.
2.మరుసటి రోజు పప్పులతో పాటు అడై కోసం ఉంచిన అన్ని పదార్ధాలను వేసి కొంచెం రవ్వగా గ్రైండ్ చేసుకోవాలి.
3.గ్రైండ్ చేసుకున్న అడై పిండిలో కొంచెం ఉప్పు,తగినన్ని నీళ్లు పోసి కాస్త చిక్కగా పిండి కలుపుకోవాలి.
4.పొడి కోసం ఉంచిన పదార్ధాలన్ని ఒక్కొటిగా వేసి ఎర్రగా వేపి పూర్తిగా చల్లారిన తరువాత మాత్రమే మెత్తని పొడి చేసుకోవాలి.
5.పెనంతో బాగా వేడి చేసి పెద్ద గరిటెడు పిండి పోసి కాస్త మందంగా దోశ మాదరిగా స్ప్రెడ్ చేసుకోవాలి.
6.కాలుతున్న దోశ పై అంచులకు నూనె వేసి పైన తయారు చేసుకున్న పొడి చల్లుకోవాలి.
7.ఒక వైపు కాలిన దోశను మరో వైపు తిప్పుకొని ముప్పై సెకన్ల తర్వాత తీసేసుకోవాలి.
8.అంతే హెల్తీ ,టేస్టీ ప్రోటీన్ దోశలు రెడీ అయినట్టే.

